బిచ్కుంద, సెప్టెంబర్ 9: బీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. మండలంలోని పెద్ద దేవాడ గ్రామ మాజీ సర్పంచ్ సంజుదేశాయ్(కాంగ్రెస్ పార్టీ)తోపాటు వందమంది కార్యకర్తలు మంగళవారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి షిండే గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన అంతంకావాలంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని పేర్కొన్నారు.
అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలలు గడుస్తున్నా..ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదని మండి పడ్డారు. కాంగ్రెస్ పాలనపై విసుగుచెంది నియోజకవర్గంలోని అంతాపూర్, మొగా గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వారం రోజుల క్రితం బీఆర్ఎస్లో చేరారని తెలిపారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తొందరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
కాంగ్రెస్, బీజేపీపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే సరికి వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి ఇంకా భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్నవారికి ఎప్పుడూ అన్యాయం చేయబోమన్నారు. కేసీఆర్ పాలనను కోరుకుంటూ బీఆర్ఎస్ పార్టీని బలపరిచే వారిని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. బిచ్కుంద పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నాయకులు నాల్చర్ రాజు, యాదారావు, బస్వరాజ పటేల్, డాక్టర్ రాజు పాల్గొన్నారు.