పటాన్చెరు రూరల్, సెప్టెంబర్ 9: సిగాచి పరిశ్రమలో మృతిచెందిన కార్మిక కుటుంబాలకు ముఖ్యమంత్రి ద్వారా ప్రకటించిన రూ.కోటి నష్టపరిహారం ఎప్పుడు చెల్లిస్తారని ప్రజాసంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని, పరిశ్రమ యాజమాన్యాన్ని నిలదీశాయి. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగిలోని పీఎస్ఆర్ గార్డెన్లో సైంటిస్ట్ ఫర్ పీపుల్, టీపీజేఏసీ, ఎన్ఏపీఎం, హెచ్ఆర్ఎఫ్, ఏపీసీఆర్ పలు అనుబంధ కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
పాశమైలారం సిగాచి అగ్నిప్రమాదంలో మృతి చెందిన 54 మంది కార్మికుల కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ జూన్ 30న పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 54మంది కార్మికులు మృతి చెందడం దేశ చరిత్రలో రెండో పెద్ద ప్రమాదమన్నారు. సైంటిస్ట్ ఫర్ పీపుల్ సంస్థ ప్రతినిధి డాక్టర్ కే బాబురావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ యాజమాన్యం ద్వారా ఇప్పిస్తామన్న రూ.కోటిని ఇంతవరకు ఇవ్వలేదన్నారు. రూ.25 లక్షలను రెండు విడతలుగా ఇచ్చి యాజమాన్యం చేతులు దులుపుకొందన్నారు.
మిగిలిన రూ.75 లక్షలు ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టత లేదన్నారు. గాయపడిన కార్మికులకు వైద్యం కూడా సరిగ్గా అందడం లేదన్నారు. నిపుణులతో పరిశ్రమల్లో ప్రమాదాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఈజీ డూయింగ్ బిజినెస్ పేరున పరిశ్రమలకు ఇష్టారీతిన అనుమతులు ఇస్తే ఇలాంటి ప్రమాదాలు చూస్తామన్నారు. సిగాచి యాజమాన్యాన్ని ఇంతవరకు అరెస్టు చేయలేదన్నారు. ప్రజా, కార్మిక సంఘాలు ఏకమై రూ.75 లక్షల పరిహారం సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. పరిశ్రమలు పెట్టి కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వనప్పుడు సమాజంలో అభివృద్ధి కనిపించదన్నారు. నష్టపోయిన కార్మికులకు సత్వర న్యాయం జరగాలన్నారు. సిగాచి పరిశ్రమలో డ్రయ్యర్, రియాక్టర్, ఇతర పరికరాలను మార్చకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నదన్నారు. నష్ట పరిహారం చెల్లించేలా అధికారులు చూడాలన్నారు.
కోటి అని చెప్పి రూ.25 లక్షలే చెల్లించారు
– బాధిత కుటుంబాలు
రూ.కోటి నష్టపరిహారం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని, పరిశ్రమ ద్వారా రూ.25 లక్షలే ఇచ్చారని బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.75లక్షలు ఎప్పుడు ఇస్తారో ఎవరూ చెప్పడం లేదన్నారు. బీహార్, యూపీ, జార్ఘండ్ రాష్ర్టాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి మిగిలిని డబ్బులకోసం పోరాడటం తమతో కావడం లేదన్నారు.
సమావేశంలో న్యాయవాది వసుధ నాగరాజ్, ఎంబీఎఫ్ జాతీయ కన్వీనర్ ఆర్.వెంకట్‌రెడ్డి, ఏపీసీఆర్ డాక్టర్ ఉస్మాన్, ఎంఎస్ఐ, ఎన్ఏపీఎం బ్రదర్ వర్గీస్, మానవ హక్కుల వేదిక నాయకుడు రోహిత్, కార్మిక సంఘాల నాయకులు నర్సింహారెడ్డి, మాణిక్యం, శివకుమార్, శివశంకర్, ప్రకాశ్‌రావు, ప్రతాప్, గోవర్ధన్, టీపీజేఏసీ జిల్లా అధ్యక్షులు వై అశోక్‌కుమార్, టీపీజేఏసీ కన్నెగంటి రవి, గోవర్దన్, రవి, విశ్వప్రసాద్, మెరాజ్‌ఖాన్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.