కాఠ్మాండు, సెప్టెంబర్ 9: ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో హిమాలయ దేశం నేపాల్ రగులుతున్నది. సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం తొలగించినప్పటికీ హింసాత్మక నిరసనలు రెండవరోజు కూడా కొనసాగాయి. ప్రజాగ్రహానికి జడిసి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేసినట్లు ఆయన సహాయకుడు ప్రకాష్ సిల్వాల్ ధ్రువీకరించారు. దేశాధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ కూడా రాజీనామా చేశారు. దేశంలో తలెత్తిన సంక్షోభానికి పరిష్కారం కనుగొని రాజకీయంగా దాన్ని పరిష్కరించడం కోసం వీలు కల్పించేందుకు తాను రాజీనామా చేసినట్లు ఓలీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రాజధాని కాఠ్మాండులో సోమవారం చెలరేగిన హింసాత్మక ఘటనలలో 20 మంది మరణించి మరో 250 మందికిపైగా గాయపడిన దరిమిలా ఓలీ దిగిపోవాలని, ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండుచేస్తూ నిరసనకారులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు.
కాలీమాటీలో మంగళవారం పోలీసు స్టేషన్‌కు నిప్పుపెట్టి, పోలీసులపై దాడికి పాల్పడిన నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పులలో ఇద్దరు యువకులు మరణించడంతో ఈ హింసాకాండలో మరణించిన వారి సంఖ్య 22కి చేరుకుంది. కాఠ్మాండులో నేపాల్ మాజీ ప్రధాని ఝలానాథ్ ఖనల్ నివాసానికి ఆందోళనకారులు నిప్పంటించడంతో ఆయన భార్య రాజ్యలక్ష్మి చిత్రకార్ మంటల్లో కాలి మరణించారు. రాజధానిలో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా, ఆయన భార్య, విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవ్‌బాపై నిరసనకారులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఓలీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న బిష్ణు ప్రసాద్ పౌడెల్(65)ను కాఠ్మాండు వీధుల్లో వెంటాడిన ఆందోళనకారులు ఆయనను తీవ్రంగా కొట్టారు. రాజీనామాకు ముందు ప్రధాని ఓలీ శాంతి, సామరస్యంతో సమస్యను పరిష్కరించుకోవాలని నిరసనకారులకు పిలుపునిచ్చారు. దుబాయ్‌కి పారిపోవాలని ఓలీ ఆలోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
నేపాల్ మాజీ ప్రధాని ఝలానాథ్ ఖనల్ సతీమణి రబీ లక్ష్మీ చిత్రకార్ నివసిస్తున్న ఇంటికి ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో మంటల్లో చిక్కుకుని ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను కీర్తిపూర్ దవాఖానకు తరలించగా ఆమె మరణించారని కుటుంబ వర్గాలు తెలిపాయి. కాగా, పార్లమెంట్ హౌస్, ప్రధాని కేపీ శర్మ ఓలీ, మంత్రులతోసహా అనేక ప్రభుత్వ భవనాలపై నిరసనకారులు దాడులు చేసి నిప్పంటించారు.
సీనియర్ రాజకీయ నాయకుల ఇళ్లపై నిరసనకారులు దాడులు చేసి ఇళ్లకు నిప్పంటించారు. నేపాల్ పార్లమెంట్‌కు నిప్పంటించిన నిరసనకారులు ప్రధాని, అధ్యక్షుడి ప్రైవేట్ నివాసాలపై దాడులు చేసి ధ్వంసం చేశారు. మంత్రుల నివాసాలు, పార్లమెంట్ భవనం ఉన్న సింఘ దర్బార్‌పై ఆందోళనకారులు దాడి చేశారు. కాఠ్మాండు, కాంతిపూర్లో పలు మీడియా కార్యాలయాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. భారత్‌కు సరిహద్దుల్లో ఉన్న బీర్‌గంజ్‌లో నేపాల్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.
దేశంలో ప్రస్తుతం జరుగుతున్న జనరేషన్ జెడ్ ఆందోళనపై అన్ని పార్టీలు చర్చించాలని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్ పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ఆయన టెలివిజన్‌లో ప్రసంగిస్తూ నిరసనకారులు తమ ఆందోళనా కార్యక్రమాన్ని నిలిపివేసి శాంతి స్థాపనకు మార్గం కనుగొనేందుకు చర్చల్లో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా అంతకుముందు, పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడుతున్న నిరసనకారులు సంయమనం పాటించి చర్చల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని నేపాల్ సైన్యం, ఇతర భద్రతా సంస్థలు మంగళవారం ఓ సంయుక్త ప్రకటనలో విజ్ఞప్తి చేశాయి.
నేపాల్‌లో తలెత్తిన తాజా పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నామని భారత ప్రభుత్వం మంగళవారం తెలిపింది. సోమవారం జరిగిన హింసాకాండలో పలువురు యువజనులు ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేసింది. శాంతియుత మార్గాలలో సమస్య పరిష్కారం కాగలదన్న ఆశాభావాన్ని ప్రభుత్వం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితులలో నేపాల్‌ను సందర్శించవద్దని భారత ప్రజలకు పిలుపునిచ్చింది. నేపాల్‌లో నివసిస్తున్న భారత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అక్కడి ప్రభుత్వ అధికారుల సూచనల మేరకు నడుచుకోవాలని కోరింది.
కాఠ్మాండు, పోఖ్రాలోని ప్రధాన కారాగారాలపై నిరసనకారులు దాడి చేశారు. పోఖ్రాలోని స్థానిక జైలులోకి నిరసనకారులు భారీ సంఖ్యలో ప్రవేశించడంతో దాదాపు 900 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. కాఠ్మాండులోని నఖూ జైలులోకి కూడా నిరసనకారులు చొరబడి ఖైదీలందరినీ విడుదల చేశారు. జైలులో ఖైదీగా ఉన్న మాజీ హోం మంత్రి రవి లమిచనేని ఆయన మద్దతుదారులు ఇంటికి తీసుకువెళ్లిపోయారు.
పార్లమెంట్ రద్దయ్యేవరకు చర్చల్లేవు పార్లమెంట్‌ను రద్దు చేసే వరకు నిరసనకారులతో చర్చలు జరిగే అవకాశం లేదని కాఠ్మాండు మేయర్ బలేన్ షా తెలిపారు. నేపాలీ ఆర్మీతో చర్చలకు సిద్ధంగా ఉండాలని ఆయన నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు.
కాఠ్మాండులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో తెలుగు కుటుంబాలు చిక్కుకున్నాయి. హయత్ రీజెన్సీ హోటల్లో బాధిత కుటుంబాలు బసచేసినట్లు తెలుస్తోంది. గుంపులుగా హోటల్లోకి చొరబడిన ఆందోళనకారులు రూముల తలుపులు తడుతూ హోటల్లో బసచేసిన అతిథుల గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి తర్వాత లూటీలు, దౌర్జన్యాలు వంటి హింసాత్మక ఘటనలు జరిగే ప్రమాదం ఉందని హోటల్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ముందుజాగ్రత్త చర్యగా తెలుగు కుటుంబాల భద్రత కోసం వారిని సమీపంలోని అతిథిగృహానికి తరలించాలని యాజమాన్యం భావిస్తోంది.
నేపాల్ పర్యటనలో ఉన్న మాజీ సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ మరో 30 మందితో కలసి కాఠ్మాండుకు 7 కిలోమీటర్ల దూరంలోని బఫాల్ వద్ద బస్సులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భారతీయ ఎంబసీ నుంచి వారికి ఆహారం, వసతి, వైద్యం వంటి సహాయక చర్యలు లభిస్తున్నట్లు తెలిసింది. తెలుగువారిని సురక్షితంగా వెనక్కు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది.