Vasthu Shastra | మాస్టర్ బెడ్రూములు, డ్రాయింగ్ రూం, కిచెన్, డైనింగ్.. వేటికవి దూరంగా కట్టొచ్చా?
– అబ్దుల్ గఫార్, బాలానగర్
ఫామ్ హౌజ్‌గా కట్టుకోవచ్చు. విశాలమైన స్థలంలో ఇంటికోసం కట్టే స్థానాన్ని దిశకు స్థిరపరచాలి. అలాగే ప్రధాన గదులుగా ఉండే ఈ విదిశల గదుల స్థానాల్ని కలుపుతూ సూచించిన ఎత్తులో ఒక బేస్మెంట్ కట్టాలి. ఇక ఈ పీఠం మీద మీరు కావాలనుకునే గదులు ఏర్పాటు చేసుకోవాలి. ప్రధానంగా మాస్టర్ బెడ్రూమ్, దాని దక్షిణం పారుకు ఆగ్నేయంలో కిచెన్, అలాగే మాస్టర్ బెడ్రూమ్ పడమర పారుకు వాయవ్యం గది, దాని ఉత్తరం పారుకు డ్రాయింగ్ రూమ్ నిర్మించుకోవాలి. ఇవి విడివిడిగా ఉంటూనే ఒకే బేస్మెంట్ మీద ఉండాలి. ఆ గదులు అన్నిటికీ బయటి నుంచి తిరిగేలా బేస్మెంట్ పాసేజ్ ఉండాలి. హాల్లోని విడి గదులను అలాగే దూరంగా కడుతూనే ఒకే శక్తిపీఠంతో బంధించాలి. అపుడే అది సంయుక్త గృహంగా నిలబడుతుంది. లేదంటే భిన్న గృహం అవుతుంది. ఈ విధంగా ఫామ్ ల్యాండ్‌లో విభజన గృహాన్ని కట్టినప్పుడు వాటి నడవలు, ద్వారాలు ఉచ్ఛమైన స్థానాల్లో ఉండాలి.
మాకు తూర్పున, దక్షిణాన రోడ్లు ఉన్నాయి. తూర్పు రోడ్డు మాత్రం మా ఇంటికే ఆఖరు. అలా ఉండొచ్చా? ఆ దిశగా ఇల్లు కట్టొచ్చా?
– బి. రమాసాయి, గజ్వేల్
మీది ఆగ్నేయం బ్లాకు. దక్షిణంలో ఉన్న రోడ్డు ఆరుపారు సాగుతుంది. కానీ, మీ ఇంటి ప్లాన్ మాత్రం తూర్పు దిశ ప్రధానంగా ఉంది. ఇదే మొదటి దోషం. ఒక్కో బ్లాకు ఇల్లు ఎలా కట్టాలో అవే నిర్దేశిస్తాయి. ఆగ్నేయం బ్లాకు దక్షిణాన్ని, వాయవ్యం బ్లాకు పశ్చిమాన్ని స్థిరపరిచి కట్టుకోవాల్సి ఉంటుంది. కేవలం దిశలతో అద్భుతం జరగదు. దానిని ఆ దిశల విశేషాలతో కుదిరిస్తేనే.. ఆ చోట ఒక శక్తి ఉత్పన్నం అవుతుంది. వీణకు తీగ ఉండాలి. తీగలకు మెట్లు ఉండాలి. ఆ బిగింపు సమంగా ఉంటేనే.. స్వరం పలుకుతుంది. నిర్మాణం-దిశ- బ్లాకు.. ఇవి చక్కగా కుదరాలి. మీ తూర్పు వీధి ఉత్తరం సాగదు కాబట్టి, మీ ఇంటిలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ఇంటి యజమానులు రానురాను ఆరోగ్య, ఐశ్వర్య నష్టాలకు గురవుతారు. మీరు ఆ చోట దక్షిణం దిశ గృహాన్ని ప్లాన్ చేయాలి. తూర్పు వీధి విషయం మరచిపోండి. అక్కడ తూర్పు ప్రభావం ఉండదు. శాస్త్రంలో దక్షిణం సూచించిన విధంగా గృహాన్ని నిర్మించండి. దక్షిణం కూడా యోగించే దిశనే. దానికి తగిన ప్లాన్ తయారు చేసుకోండి చాలు. మంచి ఫలితాలు కలుగుతాయి.
దక్షిణ భాగం పిశాచ స్థానం.. కొంత వదిలి ఇల్లు కట్టాలి అంటున్నారు. ఎంత వదిలి కట్టాలి?
– డి. చంద్రకళ, కొలన్పాక
ఇల్లు కట్టాలంటే ముందు ఆ స్థలం దిశ అనుకూలమై, చక్కని శాస్త్ర సమ్మతమైన వీధులను కలిగి ఉంటే చాలు. ఏ దిశకైనా గొప్ప ఇల్లు కుదిరించవచ్చు. దక్షిణం పిశాచం.. దెయ్యం అనేది కాదు. ఇల్లు కట్టేటప్పుడు ఇంటికి ప్రత్యేకంగా దక్షిణం వదిలి కడితే అదే నష్టం తెస్తుంది. దక్షిణం అధికంగా వదలడమే తప్పు. ఇంటి చుట్టూ ప్రదక్షిణం వచ్చే ఖాళీ వదిలి, చక్కని గాలీ వెలుతురు వచ్చేలా ఇంటి చుట్టూ చెట్లు పెట్టుకున్నా.. మనం నడవగలిగే స్థలం ఉండేలా ఆహ్లాదంగా ఉండాలి. మీరు దక్షిణం కోసం భయపడకుండా మంచి ప్లాను చేసుకొని.. దక్షిణం రోడ్డు ఉంది కాబట్టి దక్షిణం సింహద్వారంతో, ఉత్తర భాగంలోనూ విశాల స్థలం వదిలి ఇల్లు కట్టుకోండి.
మేము ముగ్గురం అన్నదమ్ములం. మా ఇండ్లను వరుసగా, ఒకదానికొకటి ఆనుకునేలా కట్టుకోవచ్చా?
– బి. దేవయ్య, దేవరుప్పుల
ఖర్చు తక్కువ అవుతుందని, అన్నదమ్ములు ఎలాగైనా కట్టుకోవచ్చని ఇండ్లను ఒంటి గోడల (కామన్ వాల్)తో కట్టడం మంచిది కాదు. ఎందరు అన్నదమ్ములు ఉన్నా, ఎవరి ఇండ్లు వారికే వేరువేరుగా ఉండాలి. వరుస (రో) ఇండ్లల్లో వాస్తు ఉండదు. అలాంటి ఇండ్లు ఆరోగ్యంగా, ఆర్థికంగా గృహస్థులను చాలా ఇబ్బందులకు గురిచేస్తాయి. ఏ ఇల్లు అయినా అది చిన్నది కావచ్చు.. పెద్దది కావచ్చు.. ‘ఇండివిజువల్’గా ఇంటి చుట్టూ ఖాళీ ఉంటూ, కాంపౌండ్ ఉంటేనే.. ఎంతో శ్రేయస్కరం. ఇల్లు ఎంత గొప్పగా, ఎంత ఖర్చుతో కట్టామన్నది కాదు. ఎంత మేరకు శాస్త్ర సమ్మతంగా, ఆరోగ్యధామంగా ఉన్నది అన్నదే ముఖ్యం.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
కోడలైనా, అల్లుడైనా కొత్తగా పెండ్లి చేసుకొని ఇంట్లోకి వస్తే, ఆ కుటుంబంలో ఏవైనా మార్పులు వస్తాయా?
మా వ్యవసాయ భూమిలో గోబర్ గ్యాస్ బావి ఉంది. అది ఉండొచ్చా, ఏ దిక్కులో ఉండాలి?