నిజామాబాద్, అక్టోబర్ 16, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజాపాలనలో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు సిద్ధమైనప్పటికీ అందుబాటులో కొనుగోలు కేంద్రాలు కరువయ్యాయి. ఫలితంగా ప్రైవేటు వర్తకుల చేతిలో చితికి పోతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ, బోధన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో పలు చోట్ల వరి కోతలు మొదలయ్యాయి. హార్వేస్టర్ యంత్రాలను వినియోగించి కోతలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి అమ్ముకుందామనుకుంటే కేంద్రాలు సకాలంలో తెరవకపోవడంతో రైతులు విలవిల్లాడుతున్నారు.
నిబంధనల మేరకు అధిక తేమ శాతాన్ని నిలువరించేందుకు రైతులంతా కలిసి జాతీయ, రాష్ట్ర, అంతర్గత బీటీ రోడ్లపై వడ్ల కుప్పలు పోసి ఆరబెట్టుకుంటున్నారు. వారం రోజులుగా వర్షం లేకపోవడంతో ఊపందుకున్న వరి కోతలతో రైతన్నలంతా ఆలస్యం చేయకుండా అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటున్నారు. ప్రైవేటు వ్యాపారులు గద్దల్లా వాలిపోతుండటంతో వారికే అప్పనంగా అప్పగిస్తున్నారు. అరకొర ధరలకే ధాన్యాన్ని సేకరించి రైతులను ప్రైవేటు వ్యాపారులు ముంచేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడు కరువయ్యారు.
వరి ధాన్యం కొనుగోలు చేస్తున్న ప్రైవేటు వర్తకులపై ప్రభుత్వం నిఘా పెట్టడం లేదు. వరి ధాన్యాన్ని సేకరించిన తర్వాత వారం, పది రోజుల్లో చెల్లింపులు చేసే అలవాటు వ్యాపారులకు ఉంది. ఇదే సంప్రదాయం చాలా చోట్ల నడుస్తోంది. ఇదే అదనుగా ప్రైవేటు వర్తకులను రైతులను నిండుగా ముంచేస్తున్నారు. మాటలతో మచ్చిక చేసుకుని ఐదారు రోజుల్లోనే ధాన్యం డబ్బులు అప్పగిస్తామని బుకాయించి కొనుగోళ్లు చేస్తున్నారు. రైతులకు ఇచ్చిన గడువు తీరిన తర్వాత మాట నిలబెట్టుకోకపోవడంతో లబోదిబోమనడం రైతుల వంతుగా మారుతోంది.
ఈ ఏడాది యాసంగిలో బోధన్ డివిజన్ పరిధిలో రైతుల నుంచి భారీ ఎత్తున ధాన్యం సేకరించి డబ్బులు చెల్లించకల తిప్పలు పెడుతున్న వ్యాపారుల లీలలు వెలుగు చూశాయి. పోలీసులను ఆశ్రయించడంతో న్యాయం కోసం కొట్లాడుతున్నారు. ప్రైవేటు వ్యాపారులపై యంత్రాంగం నిఘా పెట్టకపోవడంతో మోసగాళ్లు రాజ్యమేలుతున్నారు. రైతులను బలి పశువుగా చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలంలో 15లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. నిజామాబాద్‌లో 9లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 6లక్షల మెట్రిక్ టన్నుల మేర సేకరించనున్నట్లుగా ఇప్పటికే అంచనాలు సిద్ధమయ్యాయి. ప్రణాళిక మేరకు కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకు రాకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన కనీస మద్ధతు ధర ప్రకారం వానాకాలం 2025లో క్వింటా వడ్లకు ఏ గ్రేడ్‌కు రూ.2,389, బీ-గ్రేడ్‌కు రూ.2,369 చెల్లించాల్సి ఉంటుంది. కానీ వ్యాపారులు ఇవేవి పట్టించుకోవడం లేదు. కనీస మద్ధతు ధర అంశాన్ని తుంగలో తొక్కి రైతుల కల్లాల వద్దకే వెళ్లి ఇష్టమొచ్చిన ధరలకు సేకరిస్తున్నారు. రాబోయే సమీప రోజుల్లో వానలు కురుస్తాయేమోనన్న భయంతో రైతులంతా వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లే ప్రైవేటు వ్యాపారులకు కట్టబెడుతున్నారు. వానాకాలంలో సాధారణంగానే సన్న వడ్లను రైతులు సాగు చేస్తుంటారు.
వానాకాలంలో పండించిన ధాన్యాన్ని కొంత మేర కుటుంబ అవసరాలకు దాచి పెట్టుకోగా మిగిలిన ధాన్యాన్ని విక్రయించుకోవడం పరిపాటిగా వస్తున్నదే. ఈసారి అతి భారీ వర్షాలతో సోయా, మొక్కజొన్న పంటలతో పాటుగా వరి పంట సైతం తీవ్రంగా దెబ్బతింది. దిగుబడిపై పలు చోట్ల రైతుల్లో ఆందోళన మొదలవుతోంది. ఏకధాటి వానల మూలంగా నీరు ఎక్కువ కాలం నిలిచి ఉండటంతో వరి పైరు తీవ్రంగా దెబ్బతినడం వల్ల ఉత్పత్తి ఆశించిన స్థాయిలో వస్తుందో లేదో? అన్న ఆందోళన రైతుల్లో ఏర్పడిం ది. ప్రస్తుతం బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున కోతలు షురూ అయ్యాయి. ప్రైవేటు వ్యాపారుల హవా జోరుగా నడుస్తోంది. పొరుగు రాష్ట్రంతో పాటుగా ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు వ్యాపారులు కొనుగోళ్ల బాట పట్టి రైతుల నడ్డి విరుస్తున్నారు.
వాతావరణ ప్రభావం ఒకపక్క, ప్రభుత్వం కొనుగోలు ఎప్పుడు ప్రారంభిస్తుందో తెలియక ధాన్యాన్ని దళారులకు రూ.1900లకు అమ్మినం. మొత్తం 26 ఎకరాల్లో వరి పంట సాగుచేసినం. వర్షాలకు ధాన్యం తడిసిపోతుందని భయపడి విక్రయించాల్సి వచ్చిం ది. ప్రభుత్వం ధాన్యం సేకరించడం ఆలస్యమవుతుందని తాము నష్టపోవద్దని విక్రయించకతప్పలేదు.
-కొత్తపల్లి రవికిరణ్, రుద్రూర్
పంట చేతికొచ్చే సమయానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. హమాలీలు రాకపోవడంతో కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా తెలియలేదు. ఆలస్యం చేస్తే వర్షాలు కురిసి పంట నష్టపోవాల్సి వస్తుందనే భయంతో తక్కువ ధర అయినప్పటికీ 17 ఎకరాల ధాన్యాన్ని దళారులకు 1900 రూపాయలకే విక్రయించాం. వర్షం కురిస్తే గింజ నల్లబడి దళారులు కటింగ్ల పేరుతో మరింత ధర తగ్గిస్తారు.
-తోట నరేందర్, రైతు, రుద్రూర్