డిచ్పల్లి, అక్టోబర్ 16 : రాష్ట్ర బీసీ జేఏసీ సంఘం వారు పిలుపునిచ్చిన ఈ నెల 18న బంద్ ఫర్ జస్టిస్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బాజిరెడ్డి జగన్ అన్నారు. గురువారం వారు జిల్లా కేంద్రంలోని తమ నివాసంలో బీసీ నాయకులతో కలిసి బంద్‌కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. బీసీలు కష్టపడే వారని, వారికి న్యాయమైన వాటా దక్కాలన్నారు.
ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని చూడడం హర్షణీయమే అని, కానీ దానిని సరైన పద్ధతిలో అమలుచేయడంలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు రావొద్దని చూస్తున్నదని, అందుకే ప్రేక్షకపాత్ర వహిస్తున్నదని ఆరోపించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం పాటించిందో, అవే నియమ నిబంధనలతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వచ్చని తెలిపారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోచేతికి బెల్లం పెట్టి బీసీలకు ద్రోహం చేస్తున్నాయని మండిపడ్డారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి నిబద్ధతను నిరూపించుకోవాలని సూచించారు. బీసీలకు న్యాయం జరిగే వరకు వారికి వెన్నుదన్నుగా నిలుస్తానని పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు దక్కేలా మున్నూరుకాపులు పెద్దన్న పాత్ర వహిస్తారని, ప్రతి మున్నూరుకాపు బిడ్డ బీసీ రిజర్వేషన్లు కోసం పోరాడుతారని బాజిరెడ్డి జగన్ అన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు నరాల సుధాకర్, ఆకుల ప్రసాద్, కొయ్యాడ శంకర్, చంద్రకాంత్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.