నగరంలో వాహన ఎల్పీజీ గ్యాస్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. యుద్ధ ప్రభావంతో ఇరాన్ దిగుమతులు నిలిచిపోయాయి. అయితే ఇప్పటి వరకు గ్యాస్ కొరత లేనప్పటికీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ బంక్‌లు కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం ఇంధన వినియోగంపై సరైన చర్యలు తీసుకోకపోవడంతో బంక్ నిర్వాహకులు ఇష్టానుసారంగా రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎల్పీజీ ధర రూ.63 ఉండగా ఇప్పుడు 101 వరకు వసూలు చేస్తున్నారు. అదేంటని అడిగితే తమను ఎవరూ అడిగేవారు లేరంటూ ఎదురుదాడికి దిగుతున్నారని ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సరఫరా ఆగిపోతుందని బంక్ యాజమాన్యాలు బెంబేలిత్తిస్తుండటంతో ఆటో వాలాలు అవసరానికి మించి గ్యాస్ ఫిల్ చేయిస్తున్నారు. దీంతో బుధవారం నగరవ్యాప్తంగా గ్యాస్ బంక్‌ల వద్ద ఆటోల భారీ క్యూ కొనసాగింది.
– సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ)
సిటీలో బంక్ నిర్వాహకులు కృత్రిమ ఇంధన కొరత సృష్టించడంలో భాగంగానే చాలా ఎల్పీజీ, సీఎన్జీ బంక్‌ల వద్ద నో స్టాక్ బోర్డు పెట్టారని ఆటో డ్రైవర్లు వాపోయారు. నో స్టాక్ బోర్డులను చూసిన వాహనదారులు హైరానా చెంది వాళ్లడిగినంత ధర చెల్లిస్తారని బ్లాక్ మార్కెట్‌కు తెరలేపారు. ఒక్కసారిగా రూ.30 నుంచి 40 రూపాయలు పెంచడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బంక్ మోసాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్, దిల్షుక్నగర్, అమీర్‌పేట్, సనత్‌నగర్, ఎల్బీనగర్, మెహిదీపట్నం బంక్‌ల వద్ద ఆటోలు ఎల్పీజీ, సీఎన్జీ కోసం భారీగా క్యూ అయ్యాయి. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 460 పైగా పెట్రోల్ బంకులు ఉండగా, అందులో 95 స్టేషన్లలో గ్యాస్ పంపులు అందుబాటులో ఉన్నాయి. మరో 35 కేంద్రాల్లో నేచురల్ గ్యాస్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన బంకులతో పాటు టోటల్, రిలయన్స్ బంకులు సైతం ఉన్నాయి.
నెరవేరని రేవంత్ సర్కార్ హామీ
రేవంత్ సర్కార్ ఆటోవాలాలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తానన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదు. దీంతో ఆటో డ్రైవర్లు మానసికంగా కుంగిపోతున్నారు. 200 మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. తమ సంక్షేమం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మళ్లీ వారు కోలుకోలేని విధంగా ఇంధన ధరలు పెరగడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు భరించలేమని చాలా మంది గ్యాస్ బండ్లు నడుపుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్ కంటే సీఎన్ జీ, ఆటో గ్యాస్ తో నడిచే వాహనాలు మైలేజీ అధికంగా ఇస్తుండటమే కారణం. పెట్రోల్, డీజిల్ లీటర్ కు 15 నుంచి 20 కిలో మీటర్ల వరకు మైలేజీ ఇస్తే సీఎన్ జీ, ఆటో గ్యాస్, ఎల్పీజీ కిలో ఒకంటికి 22 నుంచి 28 కిలో మీటర్ల వరకు మైలేజీ వస్తుంది. ప్రస్తుతం మారెట్ లో పెట్రోల్, డీజిల్ బంకులతో పాటు ఆటో గ్యాస్, సీఎన్ జీ, లిక్విడ్ గ్యాస్ కేంద్రాలు వేర్వేరుగా ఉన్నాయి.
రవాణా శాఖ మంత్రి రాజీనామా చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాస్ ధరలను అదుపు చేయకుండా చోద్యం చూస్తున్నది. రవాణా శాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఉచిత బస్సుతో గిరాకీ లేక మైలేజీ ఎక్కువగా వస్తున్నదని బండ్లను నడుపుకొంటుంటే వాటి ధరలను సైతం రూ. 30 వరకు పెంచారు. యథేచ్ఛగా బంక్‌లు అక్రమాలకు పాల్పడితే కనీసం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని మంత్రిని చాలా సార్లు కలిసినా.. ఫలితం లేదు. ప్రభుత్వ జీవో లేకుండా వసూలు చేస్తున్న ఆయిల్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలి.
– వేముల మారయ్య, బీఆర్టీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు