నకిరేకల్, ఆగస్టు 6 : బీఆర్ఎస్ సర్కార్ 50 ఏండ్లు నిండిన ప్రతి గీత కార్మికుడికి నెలనెలా రూ.2,016 పింఛన్ అందజేసిందని, బీమా పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచి కార్మికుల కుటుంబాలను ఆదుకున్నట్టు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. వైన్‌షాపు టెండర్లలోనూ రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. గీతన్నలకు రూ.4 వేల పింఛన్, రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా అమలుచేసే వరకూ గీత కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా మానుకోట నుంచి హైదరాబాద్‌కు చేపడుతున్న ‘గీతన్న చైతన్యయాత్ర’ గురువారం నకిరేకల్‌కు చేరిన సందర్భంగా చిరుమర్తి సంఘీభావం ప్రకటించారు.