నర్సాపూర్, ఆగస్టు 6: బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు క్షుద్రపూజలు చేశారని పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్‌గౌడ్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ మాట్లాడడం హాస్యాస్పదమని, వారు క్షుద్రపూజలు చేసే అధికారంలోకి వచ్చారా అని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. గురువారం నర్సాపూర్‌లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల హామీలు అమలు చేయకుండా డైవర్ట్ చేయడానికే ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడిన కాంగ్రెస్ నేతలు, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎందుకు ఎత్తిపోస్తున్నారో సమాధానం చెప్పాలని సునీతాలక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు బీఆర్ఎస్ నాయకులను తిడితేగాని పొద్దుపోని పరిస్థితులు కాంగ్రెస్ నాయకులకు నెలకొన్నాయని ఎద్దేవా చేశారు. ఆరుగ్యారెంటీలు, అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చి మోసం చేసిన కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. రిటైర్డ్ ఇంజినీర్లను, విద్యార్థులను కించపరిచేలా సీఎం రేవంత్ మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మహిళలకు రూ. 2500 ఎప్పుడిస్తారని, తులం బంగారం హామీ ఏమైందని సునీతాలక్ష్మారెడ్డి ప్రశ్నించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.