హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ): ప్రజల ఆస్తులపై కావాలనే సర్కార్ పెద్దలు 22ఏ జాబితాను రాజకీయ ఆయుధంగా మలుచుకున్నారనే చేదు వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. సామాన్యుడి నుంచి సంపన్నవర్గాల వర కూ లక్ష్యంగా చేసుకొన్న కాంగ్రెస్ రాజకీ య కక్షలకు తెరలేపిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఆరు నెలలుగా నిషేధిత జాబితాలో చేర్చిన ప్రజల ఆస్తులపై కాంగ్రెస్ పెద్దల కన్నుపడిందన్న అనుమానాలు నిజమవుతున్నాయి.
ఇటీవల తన భూమిని అమ్మనందుకే కాంగ్రెస్ సర్కార్ వేధింపులకు దిగిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విరుచుకుపడ్డారు. అదే తరహాలో తనకున్న 220 గజాల స్థలాన్ని అమ్మనందుకే తన ప్లాట్‌ను నిషేధిత జాబితాలో చేర్చారంటూ మరో సాధారణ వ్యక్తి లబోదిబోమంటున్నారు. దీంతో అధికారాన్ని అడ్డంపెట్టుకొని వేల కోట్ల ఆస్తులను కూడబెట్టుకోవాలనే లక్ష్యంగా పాలన చేపట్టిన కాంగ్రెస్ పెద్దలు.. ఇప్పుడు ఆ కార్యాచరణను పద్ధతిగా అమలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
ముందుగా చెరువుల ఆక్రమణలు, బఫర్, ఎఫ్టీఎల్ భూముల సంరక్షణ పేరిట హైడ్రాను ప్రయోగించిన సర్కార్… పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను తీసుకెళ్లి వేధింపులకు గురిచేసింది. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న వేల కోట్ల భూములను కొల్లగొట్టడమే లక్ష్యంగా మూసీ ప్రాజెక్టును చేపట్టిన సర్కార్.. ఇప్పుడు వేలాది మంది ఆస్తులు, జీవితాలతో ఆటలాడుతున్నది. ప్రభుత్వ భూము ల పరిరక్షణ కోసమే అంటూ ఆరు నెలల కిందట 22ఏ జాబితాను గుట్టుగా తీసుకొ చ్చి, ప్రజలకు తమ స్థిరాస్తులపై ఎలాంటి హక్కులే లేకుండా చేసింది. దీని వెనుక సర్కార్ రాజకీయ కక్షసాధింపు చర్యలు ఉన్నాయనే అనుమానాలున్నాయి.
ఆస్తులే లక్ష్యంగా పెద్దల కుట్రలు
22ఏ జాబితాలో సామాన్యుడి నుంచి రాజకీయ ప్రత్యర్థులతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులూ బాధితులుగానే ఉన్నారు. కుట్రతోనే తన 19 ఎకరాలను ప్రభుత్వం 22ఏ జాబితాలో చేర్చిందని ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రాకు చెందిన సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. తమ భూములకు యూఎల్సీ వర్తించదన్న హైకోర్టు తీర్పులనూ పట్టించుకోకుండా, రూ.50 లక్షలు చెల్లించి నాలా కన్వర్షన్ జరిగిన మరో రెండెకరాల భూమి కోసమే ఈ కుట్రుపూరిత చర్యలకు సర్కార్ పెద్దలు దిగారని ఆరోపించారు.