బెల్జియం: 15 ఏండ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లు, ఏఐ చాట్బాట్లు, ఆన్లైన్ గేమింగ్ సేవలను స్వతంత్రంగా ఉపయోగించకుండా పరిమితం చేసే కొత్త వయో ఆధారిత నిబంధనలను యూరోపియన్ యూనియన్(ఈయూ) ప్రతిపాదించనుంది. పిల్లలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను మరింత సురక్షితంగా మార్చేందుకు రూపొందిస్తున్న విస్తృత ప్రణాళికలో భాగంగా ఈ ప్రతిపాదనను తీసుకొస్తున్నది. పిల్లలు డిజిటల్ సేవల ప్రయోజనాలను పొందేలా చూడటంతోపాటు ఆన్లైన్ వేధింపులు, దోపిడీ, ఇతర ప్రమాదాల నుంచి వారిని రక్షించడమే ఈ నిబంధనల ఉద్దేశమని యూరోపియన్ కమిషన్ పత్రం పేర్కొంది.
ప్రతిపాదిత ‘ఈయూ కిడ్స్ యాక్ట్’లో భాగంగానే ఈ ప్రణాళికను తీసుకొస్తున్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్, ఈయూ టెక్ చీఫ్ హెన్నా విర్కునెన్ ఈ వారంలో దీనిని ప్రకటించే అవకాశం ఉంది.