హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరైన బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో, పీఏపై కొందరు ముసుగులు ధరించిన వ్యక్తులు దాడికి ప్రయత్నించిన ఘటనపై సమగ్ర విచారణ జరుపాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించాలని, బాధ్యులను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముసుగులు ధరించిన సుమారు 15 మంది వ్యక్తులు ఇంటరాగేషన్ రూమ్‌లోకి ప్రవేశించగా, అకడున్న బీఆర్ఎస్ లీగల్ బృందం సభ్యులు అడ్డుకోవడంతో వారు అకడి నుంచి పారిపోయారని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని పేర్కొన్నారు. ముసుగులు ధరించిన వ్యక్తులు ఎవరు? వారి వెనుక ఎవరున్నారు? ఘటనకు దారితీసిన కారణాలేమిటో? అన్న అంశాలపై దర్యాప్తు ద్వారా తేల్చాలని కోరారు.
దాడి ఘటనను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. పోలీస్‌స్టేషన్ వంటి భద్రత కలిగిన ప్రదేశంలోకి సుమారు 15 మంది ముసుగులు ధరించి రావడంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయ విభేదాలు భౌతిక దాడులకు దారితీయకూడదని, ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి నిజానిజాలు వెల్లడించాలని కోరారు.
పోలీస్‌స్టేషన్‌ను రాజకీయ దాడులకు వేదికగా మార్చడం సిగ్గుచేటని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మాసులు ధరించిన వ్యక్తులు పోలీసుల సమక్షంలోనే దాడికి యత్నించడం ఏమిటని ప్రశ్నించారు. వారు ఎవరు? వారికి ఎవరి అండ ఉన్నది? అనే అంశాలు తేల్చాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మహేశ్, మహేందర్‌రెడ్డిపై దాడి యత్నం వెనుక కుట్ర ఉన్నదని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైన వ్యక్తులతోపాటు సంబంధిత పోలీసు అధికారుల పాత్రను కూడా పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు.
దాడి ఘటనపై సమగ్ర విచారణ అవసరమని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ముసుగులు ధరించిన వ్యక్తుల గుర్తింపు, వారి పాత్రపై స్పష్టత రావాలని, పోలీస్‌స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచి దర్యాప్తు సంస్థలకు అందించాలని కోరారు. ఆరోపణలు నిజమని తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాడ్ చేశారు.
మహేశ్, మహేందర్‌రెడ్డిపై దాడికి యత్నించిన నిందితులను గుర్తించాలని కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్ కోరారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో విచారణకు పిలిపించడం, పోలీస్‌స్టేషన్‌లోనే దాడికి ప్రయత్నించడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేసి దాడికి యత్నించిన వారిని గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
దాడి ఘటనపై తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ తీవ్రంగా స్పందించారు. పోలీస్‌స్టేషన్‌లోకి పెద్ద సంఖ్యలో వ్యక్తులు ప్రవేశించి దాడికి ప్రయత్నించడం రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయనడానికి నిదర్శనమని విమర్శించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జరిగిన పరిణామాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనను ఉద్యమ జర్నలిస్టులపై దాడిగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షుడు రమేశ్ హజారి అభివర్ణించారు. మహేశ్, మహేందర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులుగా కీలకంగా పనిచేశారని గుర్తుచేశారు. వారి వృత్తి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఘటనపై తక్షణ విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
పోలీస్‌స్టేషన్‌లోనే దాడి ఆరోపణలు రావడం ప్రజాస్వామ్యానికి ఆందోళనకరమని బీఆర్ఎస్ నేత శుభప్రద్ పటేల్ పేర్కొన్నారు. రాజకీయ విభేదాలను రాజకీయంగానే ఎదురోవాలని, ఘటనపై స్వతంత్రంగా విచారణ జరిపి పోలీసుల పాత్రపైనా పరిశీలించాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ పీఆర్వో మహేశ్ ముదిరాజ్, పీఏ మహేందర్‌రెడ్డిపై సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో దాడికి పాల్పడిన ముసుగు వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రజాపాలన అని చెప్పుకొనే ప్రభుత్వంలో పోలీస్‌స్టేషన్‌లో ఉన్న వారిపై దాడి చేస్తుంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? అని ఆందోళన వ్యక్తంచేశారు. పోలీస్ శాఖకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా విచారణ జరుపాలని కోరారు.