న్యూఢిల్లీ: అంతరిక్షంలో ఆయుధాలు మోహరించినట్టు అమెరికా మొట్టమొదటిసారి ఒప్పుకొన్నది. అమెరికా వైమానిక దళ కార్యదర్శి ట్రాయ్ మెయింక్ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. అవసరమైతే శత్రువుల దాడుల నుంచి అమెరికా సైనికులను రక్షించడానికి ఉపయోగించగల ఆయుధాలు అమెరికా వద్ద కక్ష్యలో ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే అవి ఎలాంటి ఆయుధాలు, ఎన్ని మోహరించారు లేదా వాటిని అంతరిక్షంలోకి ఎప్పుడు పంపారు అనే వివరాలను ఆ అమెరికా అధికారి వెల్లడించలేదు. అంతరిక్షంలో తమ సైనిక సామర్థ్యాలను విస్తరించుకునేందుకు అమెరికా, రష్యా, చైనా పోటీపడుతున్న తరుణంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంతరిక్షంలో ఆయుధ పోటీ మరింత తీవ్రతరం కాగలదనే ఆందోళనలను కూడా ఇది రేకెత్తించింది.
అనూమ్య పరిణామాలు!
రష్యా, చైనా అంతరిక్ష ఆధారిత సైనిక సామర్థ్యాలను పంచుకోవడంపై అమెరికా చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఆధునిక యుద్ధతంత్రంలో ఉపగ్రహాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సమాచార ప్రసారం, నిఘా సమాచార సేకరణ, క్షిపణి పర్యవేక్షణ కోసం సైన్యాలు ఉపగ్రహాలను ఉపయోగిస్తున్నాయి. ఒక దేశ ఉపగ్రహాలపై దాడి జరిగితే దాని సైనిక సామర్థ్యం బలహీనపడే అవకాశం ఉంది. దీనివల్ల ప్రధాన సైనిక శక్తులు ఇకపై కేవలం కొత్త ఉపగ్రహాలను అభివృద్ధి చేయడంపైనే దృష్టి సారించడం లేదు. అవి తమ ఉపగ్రహాలను శత్రువుల దాడుల నుంచి రక్షించుకోవడానికి, అలాగే అవసరమైతే ఇతర దేశాల అంతరిక్ష వ్యవస్థలకు అంతరాయం కలిగించడానికి అవసరమైన సామర్థ్యాలను కూడా అభివృద్ధి చేస్తున్నాయి. అమెరికా చేసిన ఈ ప్రకటన అంతరిక్షంలో తమ సైనిక సామర్థ్యాలను మరింత విస్తరించుకోవడానికి రష్యా, చైనాలను ప్రేరేపించవచ్చని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ప్రజలపై ప్రభావం
అమెరికా, రష్యా, చైనా మధ్య అంతరిక్షంలో సైనిక ఘర్షణ జరిగిన పక్షంలో సాధారణ ప్రజల దైనందిన జీవితాలపై అది ప్రభావం చూపవచ్చు. ఉపగ్రహాలు దెబ్బతిన్నా లేదా నాశనమైనా మొబైల్, ఇతర కమ్యూనికేషన్ నెట్వర్క్లు, నావిగేషన్ వ్యవస్థలు, వాతావరణ సమాచారానికి అంతరాయం కలుగవచ్చు.