నిజాంసాగర్, అక్టోబర్16: మత్స్యకారుల ఉపాధి కోసం చేపట్టిన ‘చేప పిల్లల పంపిణీ’పై నిర్లక్ష్యం నెలకొన్నది. జిల్లాలో చేప పిల్లల విడుదల కోసం ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియ పూర్తిచేయకపోవడం గమనార్హం. ఈయేడు కురిసిన వర్షాలకు జిల్లాలోని చెరువులు, జలాశయాలు జలకళను సంతరించుకోగా, ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియ, చేప పిల్లల విడుదలలో జాప్యం నెలకొనడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టెండర్లు పూర్తి చేసి చేప పిల్లల సరఫరాకు శ్రీకారం చుట్టినప్పటికీ కామారెడ్డిలో టెండర్ ప్రక్రియను పలు మార్లు ప్రారంభించినా సరఫరా చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని, దీంతో చేప పిల్ల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలోని 14 వేల మంది మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇప్పటివరకూ చేప పిల్లలు విడుదల చేయకపోవడంతో వేట సీజన్‌ను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టెండర్లు పూర్తి చేసి చేప పిల్లల సరఫరాకు శ్రీకారం చుట్టినప్పటికీ కామారెడ్డిజిల్లాతో పాటు మెదక్, కరీంనగర్, నిర్మల్ నాలుగు జిల్లాల్లో మాత్రం కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్ల ప్రక్రియ నేటికీ పూర్తికాలేదు. జిల్లాలో 768 చెరువులు, కుంటలతో పాటు నిజాంసాగర్, కౌలాస్‌నాలా ప్రాజెక్టుల్లో మొత్తం 2.85 కోట్ల చేప పిల్లల విడుదల లక్ష్యంగా పెట్టుకున్నారు. వర్షాకాలం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా చేప పిల్లల జాడ కనిపించకపోవడంతో మత్స్యకారులు నిరాశకు గురవుతున్నారు.
అధికారులు టెండర్ ప్రక్రియను పలుమార్లు ప్రారంభించినా సరఫరాదారులు స్పందించలేదు. దీంతో చేప పిల్లల పంపిణీ నిలిచిపోయింది. గతేడాది కూడా ప్రభుత్వం బడ్జెట్లో 50 శాతం కోత విధించడంతో కేవలం 1.4 కోట్ల చేప పిల్లలనే విడుదల చేశారు. ఈ సంవత్సరం నాలుగు నెలలు ఆలస్యమైనప్పటికీ చేప పిల్లల విడుదల జాడే లేదు.
జిల్లాలో చేప పిల్లలను సరఫరా చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో విడుదలలో జాప్యం జరుగుతున్నది. రాష్ట్రంలో కామారెడ్డితోపాటు పలు జిల్లాలు మినహా దాదాపు అన్ని జిల్లాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇటీవల ఈ విషయంపై మత్స్యశాఖ మంత్రి దృష్టికి సైతం తీసుకెళ్లాం.
– శ్రీపతి, కామారెడ్డి జిల్లా మత్స్యశాఖ అధికారి