ఇంటి అలంకరణ అంటే ఫర్నిచర్, గృహాలంకారాలు, గృహోపకరణాలే కాదు.. బాత్రూమ్ అలంకారం కూడా! ఇంటి నిర్మాణంలో ఓ మూలన స్నానాల గదిని కట్టేస్తున్నారు. దాని అలంకరణ గురించి పెద్దగా పట్టింపు కూడా ఉండట్లేదు. కానీ, బాత్రూమ్ అలంకరణపై దృష్టిపెడితే ‘స్పా’ అంత అందంగా మార్చుకోవచ్చు. గోడలకు అందమైన డిజైన్లు, మూలల్లో, షెల్ఫ్‌ల్లో ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటే.. స్నానాల గది ఆహ్లాదకరంగా మారిపోతుంది. బాత్రూమ్లో తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ తేమ వల్ల వెంటిలేటర్లు, డోర్లు, టైల్స్, ట్యాప్‌లపై ఫంగస్, బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది. వీటి వల్ల దుర్వాసన వస్తుంది. ఈ సమస్యలు రాకుండా కొన్నిరకాల మొక్కలు పెంచుకుంటే..
తేమ నియంత్రణలో ఉంటుంది. గదిలోనూ సువాసన వ్యాపిస్తుంది. గాలిలో ఉండే తేమను గ్రహించి పెరిగేందుకు ఆర్కిడ్స్ అనువైనవి. వీటికి తక్కువ బరువు ఉండే పూలు పూస్తాయి. వెంటిలేటర్లు, షెల్ఫ్‌లో వీటిని సులభంగా పెంచుకోవచ్చు. బోస్టన్ ఫెర్న్ని ఎంచుకుంటే ఎక్కువ తేమను గ్రహిస్తాయి. తక్కువ వెలుతురు ఉండేచోట స్నేక్ ప్లాంట్ బాగా పెరుగుతుంది. పీస్ లిల్లీలు.. గాలిలో ఉండే కాలుష్యాన్ని ఎక్కువ మొత్తంలో గ్రహిస్తాయి. పెద్ద ఆకులతో ఆకర్షనీయంగా ఉంటాయి. తక్కువ వెలుతురులోనూ సులభంగా పెరుగుతాయి. బాత్రూమ్లో ఎక్కువ తేమను గ్రహిస్తాయి.