వినాయక్‌నగర్, అక్టోబర్ 16: తెలంగాణతోపాటు పలు జిల్లాల్లో ఆటోలు, బైక్‌లను ఎత్తుకెళ్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ సీపీ సాయిచైతన్య తెలిపారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఠాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జిల్లా కేంద్రానికి చెందిన కొంతమంది యువకులు ముఠాగా ఏర్పడి నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పట్టణంతోపాటు మహారాష్ట్ర శివారు ముథోల్ ప్రాంతంలో ఆటోరిక్షాలు, ద్విచక్ర వాహనాలను దొంగిలించారు.
దొంగిలించిన వాహనాలకు ఫేక్ నంబర్లు అతికించి కోరుట్ల, జగిత్యాల్ ప్రాంతాల్లో విక్రయించారు. వాహన బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సీసీఎస్ ఏసీపీ నాగేంద్రాచారి, ఇన్స్పెక్టర్లు రవీందర్, సాయినాథ్, సురేశ్ సిబ్బందితో కలిసి నిజామాబాద్‌లోని ఆటోనగర్‌కు చెందిన షేక్ ఫాజిల్, మహ్మద్ నవాజ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో షేక్ అలీ, హలీంతో కలిసి 9 ఆటోలు, మూడు బైకులను కోరుట్లకు చెందిన మహ్మద్ ఇమ్రాన్, మహమ్మద్‌కు విక్రయించినట్లు అంగీకరించారు. నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ తెలిపారు. అయితే ఈ ముఠాకు చెందిన మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.