Ayodhya Ram Temple | యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh)లోని అయోధ్య (Ayodhya)లో చేపట్టిన రామ మందిర (Ayodhya Ram Mandir ) నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయం నిర్మాణానికి సంబంధించిన చాలా పనులు ఇప్పటికే పూర్తైనట్లు తెలుస్తోంది. ఆలయ నిర్మాణానికి సంబంధించిన కొన్ని ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం తాజాగా విడుదల చేసింది. ఆలయ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు ముందుకు సాగుతున్నట్లు తెలిపింది.
గ్రౌండ్ ఫ్లోర్ పనులు నవంబర్‌కల్లా పూర్తి అవుతాయని పేర్కొంది. మొదటి అంతస్తులో 50 శాతం పనులు పూర్తైనట్లు తెలిపింది. డిసెంబర్ చివరి నాటికి మొదటి అంతస్తు పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్రస్ట్ వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరిలో ఆలయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. 2024 జనవరి 21-23 తేదీల్లో ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
జనవరి 21 నుంచి 23వ తేదీల మధ్య నిర్వహించే రాముడి విగ్రహప్రతిష్టాపనకు (Ayodhya Ram Mandir Opening Date) దేశ నలమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు ట్రస్టు భావిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి ఆహ్వానించే అతిథుల జాబితాపై ట్రస్టు దృష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా మొత్తం 25వేల మందిని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు.. ట్రస్టు ఇదివరకే ప్రకటించింది.
అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి 2020 ఆగస్టు 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకలను స్థాపించారు. మూడు అంతస్తుల్లో, ఐదు మండపాలుగా చేపడుతున్న రామాలయ నిర్మాణానికి సుమారు రూ.1800 కోట్లు ఖర్చవుతాయని ట్రస్టు సభ్యులు ఇప్పటికే వెల్లడించారు. అహ్మదాబాద్‌కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్ట్స్ ‘సోమ్‌పురా ఫ్యామిలీ’ అయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తోంది.
Recent pictures from Shri Ram Janmabhoomi Mandir construction site.
श्री राम जन्मभूमि मंदिर निर्माण स्थल से आज प्राप्त चित्र pic.twitter.com/qMKiQhPRAn
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) September 25, 2023
Also Read..
Human Diseases: 2100 నాటికి వ్యాధుల నిర్మూలనే లక్ష్యం.. చాన్ జుకర్‌బర్గ్ సంస్థ ప్రకటన
SBI | మూడు బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. నిబంధనలు ఉల్లంఘించిన ఎస్బీఐకి 1.3 కోట్ల జరిమానా