Mangala Snanam | అన్షు మరియు వాసవి గణేషన్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘హుషారు పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియోస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేష్ ఫిల్మ్స్ విడుదల చేస్తుండటంతో ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు భారీ స్పందన రాగా, తాజాగా ఈ చిత్రం నుంచి ‘మంగళస్నానం’ అనే హార్ట్ టచింగ్ ఎమోషనల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
గుండెను హత్తుకునే తండ్రీకూతుళ్ల గీతం:
ఈ పాట ఒక తండ్రి తన కూతురిని ఎంత అల్లారుముద్దుగా పెంచుకుంటారో, ఆమెపై ఎంతటి ప్రాణాన్ని పెట్టుకుంటారో అద్భుతంగా ఆవిష్కరించింది. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే విడదీయలేని అనుబంధానికి ఈ గీతం అద్దం పడుతోంది. ఎస్.ఎస్. చిరంజన్ హృద్యమైన సాహిత్యం అందించగా, యోగి సురేష్ మరియు విహా తమ గాత్రంతో ప్రాణం పోశారు. చరణ్ అర్జున్ అందించిన సంగీతం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
పాట విడుదల సందర్భంగా దర్శకుడు బిక్షు మాట్లాడుతూ.. ‘తండ్రీకూతుళ్ల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమను ఈ పాటలో చూపించాం. ఈ సినిమా కేవలం యువతకే కాదు, తల్లిదండ్రులు కూడా చూడాల్సిన ఒక చక్కని కుటుంబ కథా చిత్రం. నా నిజ జీవితంలో నేను చూసిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించాను. యువతకు కావాల్సిన హుషారును ఇస్తూనే, ఒక సరికొత్త థ్రిల్‌ను ఈ సినిమా పంచుతుంది’ అని తెలిపారు.
నిర్మాత వెంకట్ యాదవ్ మాట్లాడుతూ.. ‘సినిమా ప్రథమార్ధం అంతా యూత్‌ఫుల్ కంటెంట్‌తో ఎంటర్టైన్ చేస్తే, ద్వితీయార్థంలో ఒక మెచ్యూర్డ్ పాయింట్ ఉంటుంది. సమాజంలో బాధ్యతాయుతమైన విషయాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాం. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూశాక ఒక బాధ్యతను గుర్తిస్తారు. నటీనటులందరూ చాలా సహజంగా నటించారు. కచ్చితంగా ఇది పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం మాకుంది’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.
త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో అన్షు, వాసవి గణేషన్‌లతో పాటు గోవర్థన్, సునీత్ మనోహర్, రమేష్, బలగం బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.