SBI | ముంబై, సెప్టెంబర్ 25: వివిధ నియంత్రణాపరమైన నిబంధనల్ని ఉల్లఘించినందుకు ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లకు పెనాల్టీలు విధించినట్టు రిజర్వ్‌బ్యాంక్ సోమవారం తెలిపింది. రుణాలు, అడ్వాన్సులపై ఆర్బీఐ జారీచేసిన కొన్ని ఆదేశాల్ని, ఇంట్రాగ్రూప్ లావాదేవీలపై మార్గదర్శకాల్ని పాటించనందున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రూ.1.3 కోట్ల జరిమానా వేసినట్టు కేంద్ర బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
అలాగే ‘రుణాలు, అడ్వాన్సులు-చట్టబద్ద నియంత్రణలు’ కేవైసీ, డిపాజిట్లపై వడ్డీరేట్లకు సంబంధించి 2016లో జారీచేసిన ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఇండియన్ బ్యాంక్‌కు రూ.1.62 కోట్ల పెనాల్టీ విధించినట్టు ఆర్బీఐ మరో ప్రకటనలో తెలిపింది. అలాగే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ స్కీమ్‌కు చెందిన కొన్ని నిబంధనల్ని పాటించనందున పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌కు రూ.1 కోటి పెనాల్టీ వేసింది.