Flight crash : ఈ నెల 12 చోటుచేసుకున్న అహ్మదాబాద్ (Ahmedabad) విమాన ప్రమాదం (Flight accident) మొత్తం 274 మందిని పొట్టనపెట్టుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో రమేష్ విశ్వాస్ కుమార్ (Ramesh Vishwas Kumar) అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన 241 మందిలో 229 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలెట్లు ఉన్నారు.
విమానం ఎయిర్పోర్టు సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై పడటంతో ఆ హాస్టల్లో ఉన్న వైద్యులు 33 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో గాథ ఉన్నది. భారత సంతతికి చెందిన బ్రిటీష్ పౌరుడు రమేష్ చంద్ పటేల్ది కూడా అలాంటి గాథనే.
రమేష్ చంద్ పటేల్ తనకెంతో ఇష్టమైన జంబూరా పండ్లు తినడం కోసం భారత్కు వచ్చాడని ఆయన కుమార్తె ప్రీతి పాండ్యా చెప్పారు. తన తల్లిదండ్రలు బ్రిటన్లో స్థిరపడ్డారని, గుజరాత్లో వారికి సొంత ఇళ్లు ఉన్నదని, ప్రతి ఏడాది వేసవిలో వారు కొన్ని వారాలపాటు భారత్కు వచ్చి గడిపి వెళ్లేవారని ఆమె తెలిపారు. భారతదేశం అంటే తన తండ్రికి చాలా ఇష్టమని, అందుకే ఇక్కడ ఇళ్లు ఉంచుకుని ప్రతి ఏడాది వచ్చేవారని అన్నారు.
అయితే ఈసారి తన తల్లిని తీసుకురాకుండా ఒక్కరే వచ్చారని, ఆయన జంబూరా పండ్లు అంటే చాలా ఇష్టమని, ఆ పండ్లు తినడం కోసం కేవలం 9 రోజుల ట్రిప్ ప్లాన్ చేసుకుని వచ్చారని ప్రీతి పాండ్యా తెలిపారు. ఈ తొమ్మిది రోజులు తాను తన తండ్రికి ఇష్టమైన వంటకాలు చేసి పెట్టానని చెప్పారు. తిరుగు ప్రయాణంలో ఆయన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ప్రీతి విలపించారు.