Honeymoon murder : మేఘాలయ (Meghalaya) లో భర్త రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య తర్వాత సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi) దాదాపు 18 రోజులపాటు కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఘాజీపూర్ (Ghazipur) కు వెళ్లి అక్కడి పోలీసులకు లొంగిపోయింది. ఆ 18 రోజులపాటు ఆమె ఎక్కడికి వెళ్లిందనే సస్పెన్స్‌గా మిగిలిపోయింది.
అయితే పోలీసుల దర్యాప్తులో ఒక్కో విషయం వెలుగులోకి వస్తున్నాయి. రాజా రఘువంశీ హత్య తర్వాత సోనమ్ తిరిగి ఇండోర్‌కు వచ్చింది. ఇండోర్‌లోని ఓ అద్దె ఇంట్లో ఉన్నది. రాజాను చంపిన హంతకుల్లో ఒకడైన విశాల్ సింగ్ చౌహాన్ మే 30న అంటే హత్య తర్వాత ఏడు రోజులకు ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు విచారణలో తేలింది. జూన్ 9న తెల్లవారుజామున పోలీసులకు లొంగిపోయే వరకు ఆమె అక్కడే ఉన్నది.
విశాల్ చౌహాన్ తాను ఇంటీరియర్ డిజైనర్నని చెప్పి ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు వెల్లడైంది. అద్దె ఇంటికి అడ్వాన్స్‌గా రూ.16 వేలు ఇచ్చినట్లు నిందితుడు విశాల్ ఒప్పుకున్నాడు. కాగా ఈ నెల 23న మేఘాలయలో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌కు చెందిన వ్యాపారి రాజా రఘువంశీ హత్యకు గురయ్యాడు. అతడి భార్య సోనమ్ కిరాయి హంతకులను పెట్టి రాజాను హత్య చేయించింది. హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లి ప్లాన్‌ను పక్కాగా అమలుచేసింది.
ఈ హత్య కుట్రకు సూత్రధారి సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహగా పోలీసులు తేల్చారు. రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీల వివాహం మే 11న జరిగింది. ఆ తర్వాత ఐదు రోజులకే సోనమ్, ఆమె ప్రియుడు కలిసి రాజా హత్యకు కుట్రపన్నారు. హత్య చేసేందుకు ముగ్గురు కిరాయి హంతకులను మాట్లాడారు. ఆ కుట్రలో భాగంగానే సోనమ్ తన భర్తను హనీమూన్‌కు ఒప్పించింది.
మే 20న ఇద్దరు కలిసి హనీమూన్‌కు వెళ్లారు. ముందుగా గువాహటిలోని కామాఖ్య ఆలయానికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత మేఘాలయలోని వివిధ ప్రాంతాల్లో తిరిగారు. మే 23న సోనమ్ తన భర్తను ఉత్తరకాసీ కొండలకు తీసుకెళ్లి కిరాయి హంతకులతో హత్య చేయించింది. సోనమ్ రాజ్ కుశ్వాహ ఇండోర్‌లో ఉండే ఫోన్ ద్వారా హత్య పథకం అమలు చేశాడు. హత్య అనంతరం సోనమ్, హంతకులు వేర్వేరు మార్గాల్లో ఇండోర్‌కు చేరుకున్నారు.
ఈ కేసును ముందుగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు రాజా రఘువంశీ మృతదేహం లభ్యం కావడంతో హత్య కేసుగా మార్చారు. మేఘాలయ పోలీసులు నిందితులు ఐదుగురిని షిల్లాంగ్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు విషయాలు వెల్లడవుతున్నాయి.