The 11A mystery : ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఆ విమానంలో ఉన్న 242 మందికిగాను 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ భారత సంతతికి చెందిన బ్రిటిషర్ రమేష్ విశ్వాస్ కుమార్ ఒక్కడే బతికి బయటపడ్డాడు. విమానం మంటల్లో కాలిపోతుంటే రమేశ్ విశ్వాస్ మాత్రం దాని నుంచి బయటిపడి గాయాలతో నడుచుకుంటూ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
అయితే రమేష్ విశ్వాస్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఉండే 11A సీటులో కూర్చుని ప్రయాణించడమే అతడి ప్రాణాలు దక్కడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. తన సీటుకు ముందే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండటంతో అతడు ఆ డోర్ తెరుచుకుని బయటికి రాగలిగాడని అంటున్నారు. కాగా 11A సీటులో ప్రయాణించి విమానం ప్రమాదానికి గురైనా వ్యక్తి ప్రాణాలతో బయటపడటం ఇదే తొలిసారి కాదు.
1998లో కూడా ఇలాంటి నమ్మశక్యంకానీ ఘటనే చోటుచేసుకుంది. థాయ్‌లాండ్‌కు చెందిన నటుడు, గాయకుడు రువాంగ్సాక్ లోయ్చుసాక్ (Ruangsak Loychusak) కూడా అచ్చం రమేశ్ విశ్వాస్ మాదిరిగానే విమాన ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గరి 11A సీటులోనే ప్రయాణించారు. నాడు ప్రమాదానికి గురైన థాయ్ ఎయిర్వేస్కు చెందిన TG261 విమానంలో మొత్తం 146 మంది ఉండగా 101 మంది మరణించారు.
రువాంగ్సాక్ లోయ్చుసాక్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటికి వచ్చారు. నాడు దక్షిణ థాయ్‌లాండ్‌లో విమానాన్ని ల్యాండింగ్ చేస్తుండగా అదుపుతప్పి బురదపొలాల్లో పడిపోయింది. ఇదిలావుంటే తాజాగా ఎయిరిండియా ప్రమాదం నుంచి రమేష్ ఒక్కడే ప్రాణాలతో బయటపడటంపై రువాంగ్ సాక్ స్పందించారు. ఈ విషయం తనకు ఒళ్లు గగుర్పొడిచేలా చేసిందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
తనకు 27 ఏళ్ల క్రితం జరిగిన ఘటన గుర్తుకొచ్చిందని చెప్పారు. తాను 20 ఏళ్ల వయసులో ఉండగా ఇలాగే ప్రమాదం నుంచి బయటపడ్డానని చెప్పారు. తాను కూడా 11A సీటులోనే ప్రయాణించానని తెలిపారు. నాడు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడటం తనకు పునర్జన్మ లాంటిదని అన్నారు. కాగా ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత రువాంగ్ సాక్ దాదాపు పదేళ్లపాటు మళ్లీ విమానం ఎక్కలేదని తెలిసింది.