 
                                                            బెంగళూరు: ఒక మహిళ కూతురి స్నేహితులు రాత్రి వేళ ఇంటికి వచ్చారు. వారిని ఇంట్లోకి రావద్దని ఆమె చెప్పింది. పోలీసులకు ఫోన్ చేస్తానని బెదిరించింది. ఈ నేపథ్యంలో కుమార్తె స్నేహితులు ఆ మహిళను హత్య చేశారు. (Woman Killed By Daughter’s Friends) ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. సుబ్రహ్మణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉత్తరహళ్లి ప్రాంతంలో 34 ఏళ్ల నేత్రావతి తన మైనర్ కుమార్తెతో కలిసి నివసిస్తున్నది. లోన్ రికవరీ కంపెనీలో హెల్పర్‌గా ఆమె పని చేస్తున్నది.
కాగా, అక్టోబర్ 25న రాత్రి వేళ నేత్రావతి, ఆమె కుమార్తె ఇంట్లో ఉన్నారు. ఆ రాత్రి 10.30 గంటల సమయంలో కూతురి స్నేహితులైన 16, 17 ఏళ్ల వయస్సున్న నలుగురు బాలికలు ఆమె ఇంటికి వచ్చారు. కుమార్తెతో పాటు చదువు మాసేసిన వారిని చూసి నేత్రావతి మండిపడింది. రాత్రివేళ తమ ఇంట్లోకి రావద్దని చెప్పింది. అక్కడి నుంచి వెళ్లకపోతే పోలీసులకు ఫోన్ చేస్తానని బెదిరించింది.
మరోవైపు నలుగురు మైనర్ బాలికలు దారుణానికి పాల్పడ్డారు. టవల్‌తో ఆమె గొంతునొక్కి హత్య చేశారు. నేత్రావతి మృతదేహాన్ని మరో గదిలోకి ఈడ్చుకెళ్లారు. సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడదీశారు. ఆత్యహత్యకు పాల్పడినట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని ఆమె కుమార్తెను కత్తితో బెదిరించి వెళ్లిపోయారు. తల్లి హత్యతో భయాందోళన చెందిన కుమార్తె కూడా తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. తల్లి చనిపోయినట్లు ఫోన్ రావడంతో ఆ మరునాడు ఇంటికి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ తన ఫ్రెండ్స్ వద్దకు వెళ్లింది.
కాగా, కేటీఎం లేఅవుట్ ప్రాంతంలో నివసిస్తున్న నేత్రావతి చెల్లెలు అనిత తన సోదరి మరణంపై అనుమానం వ్యక్తం చేసింది. అక్టోబర్ 27న సుబ్రహ్మణ్యపుర పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో అసహజ మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అక్టోబర్ 29న అనిత మళ్లీ ఆ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తన సోదరి మరణం తర్వాత ఆమె కుమార్తె అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేసింది.
మరోవైపు అక్టోబర్ 30న ఆ బాలిక ఇంటికి తిరిగి వచ్చింది. తల్లిని తన స్నేహితులు హత్య చేసినట్లు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే స్నేహితులతో కలిసి తల్లిని ఆమె హత్య చేసినట్లు అనిత అనుమానం వ్యక్తం చేసింది. తన సోదరి నేత్రావతి మరణంపై సమగ్రంగా దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Farmer Attempts Suicide | ఓటరు జాబితా నుంచి పేరు తొలగిస్తారన్న భయంతో.. బెంగాల్ రైతు ఆత్మహత్యాయత్నం
Watch: ఛత్ ప్రసాదం కోసం.. ప్యాసింజర్ రైలు ఆపిన లోకో పైలట్, వీడియో వైరల్
 
                            