కోల్‌కతా: అక్షర దోషం కారణంగా ఓటరు జాబితా నుంచి పేరు తొలగిస్తారన్న భయంతో ఒక రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. (Farmer Attempts Suicide) అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎలక్షన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) చేపడుతున్న పశ్చిమ బెంగాల్లో ఈ సంఘటన జరిగింది. కూచ్ బెహార్ జిల్లాలోని జీత్పూర్ ప్రాంతానికి చెందిన ఖైరుల్ షేక్ రైతు. ఓటరు కార్డులో అక్షర దోషం కారణంగా అతడి పేరు షేక్ బదులు సేఖ్గా ఉన్నది.
కాగా, బెంగాల్లో సర్ ప్రక్రియ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో అక్షర దోషం కారణంగా ఓటరు జాబితా నుంచి తన పేరు తొలగిస్తారేమోనని రైతు ఖైరుల్ షేక్ ఆందోళన చెందాడు. బుధవారం పొలంలో పని చేస్తుండగా పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు తొలుత దిన్హాటాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం కూచ్ బెహార్‌లోని ఎంజేఎన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు మంగళవారం ఉత్తర 24 పరగణాల జిల్లాలో 57 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. జాతీయ పౌర నమోదు (ఎన్నార్సీ) తన మరణానికి కారణమని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. బెంగాల్లో సర్ ప్రక్రియ గురించి ప్రకటించినప్పటి నుంచి అతడు ఆందోళన చెందుతున్నట్లు కుటుంబ సభ్యులు వాపోయారు.
Also Read:
Fake Scientist | నకిలీ బార్క్ సైంటిస్ట్ అరెస్ట్.. కీలక అణు సమాచారం లీక్ చేసినట్లు అనుమానం