ముంబై: దేశంలోని ప్రముఖ అణు పరిశోధనా సంస్థ అయిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)కు చెందిన నకిలీ శాస్త్రవేత్తను (Fake Scientist) ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అనుమానాస్పద అణు డేటా, 14 మ్యాప్‌లను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సున్నితమైన అణు సమాచారాన్ని విదేశీ నెట్‌వర్క్‌లకు అతడు లీక్ చేసినట్లు అనుమానిస్తున్నారు. గత వారం ముంబైలోని వెర్సోవాలో అక్తర్ హుస్సేనిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. పలు పేర్లుతో కూడిన ఐడీలతో శాస్త్రవేత్తగా అందరిని నమ్మించినట్లు తెలుసుకున్నారు. నకిలీ బార్క్ ఐడీలు, నకిలీ ఆధార్, పాన్ కార్డులు, నకిలీ పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఐడీలో అలీ రజా హుస్సేన్, మరో ఐడీలో అలెగ్జాండర్ పామర్ అని ఉన్నట్లు గుర్తించారు.
కాగా, అక్తర్ హుస్సేని గత కొన్ని నెలలుగా అనేక అంతర్జాతీయ కాల్స్ చేసినట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. సున్నితమైన అణు సమాచారాన్ని విదేశీ నెట్‌వర్క్‌లతో అతడు షేర్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడి కాల్ రికార్డులను పరిశీలిస్తున్నారు.
మరోవైపు హుస్సేని తన గుర్తింపును మార్చుకుని మారువేషంలో జీవించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రహస్య పత్రాలు కలిగిన శాస్త్రవేత్తగా చెప్పుకున్న అతడ్ని 2004లో దుబాయ్ నుంచి బహిష్కరించారు. అయితే బహిష్కరణ తర్వాత కూడా నకిలీ పాస్‌పోర్ట్‌లతో దుబాయ్, టెహ్రాన్‌తో పాటు ఇతర విదేశీ ప్రదేశాలకు అతడు ప్రయాణించినట్లు పోలీసులు తెలుసుకున్నారు.
జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన అక్తర్ హుస్సేని 1996లో తన పూర్వీకుల ఇంటిని విక్రయించాడు. అదే రాష్టానికి చెందిన మునాజిల్ ఖాన్‌ను అక్తర్ సోదరుడు ఆదిల్ అతడికి పరిచయం చేశాడు. దీంతో హుస్సేని మొహమ్మద్ ఆదిల్, నసీముద్దీన్ సయ్యద్ ఆదిల్ హుస్సేని పేర్లతో రెండు పాస్‌పోర్ట్‌లను ఖాన్ తయారు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 30 ఏళ్ల కిందట జంషెడ్‌పూర్‌లో అమ్మిన ఇంటి చిరునామా నకిలీ పాస్‌పోర్ట్‌లలో ఉన్నట్లు గుర్తించారు.
ఇటీవల ఢిల్లీ పోలీసులు ఆదిల్ హుస్సేనిని అరెస్టు చేశారు. అయితే పోలీసులను తప్పుదారి పట్టించడానికి అక్తర్ హుస్సేని ప్రయత్నించాడు. తన సోదరుడు చాలా కాలం క్రితం చనిపోయినట్లు విచారణలో పేర్కొన్నాడు.
అలాగే అక్తర్ హుస్సేనికి స్కూల్, కాలేజీ డిగ్రీలతో సహా నకిలీ విద్యా సర్టిఫికెట్లను మునాజిల్ ఖాన్ సోదరుడు ఇలియాస్ ఖాన్ సమకూర్చినట్లు దర్యాప్తులో తెలిసింది. గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై అసంతృప్తిని రెచ్చగొట్టేలా సమాచారం వ్యాప్తి చేసిన కేసులో అక్తర్ కోసం మీరట్ పోలీసులు కూడా గాలిస్తున్నారు.
Also Read:
Watch: బాలిక పైనుంచి కారు నడిపిన మైనర్ బాలుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Watch: ఆసక్తి రేపుతున్న డ్రైవర్‌లెస్ కారు.. వీడియో వైరల్