వరంగల్, మార్చి 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భూపాలపల్లి : మరమ్మతుల మాటున కాళేశ్వరంలో ఇసుక దందా మొదలైంది. ప్రాజెక్టు అడ్డాగా ఇసుకాసురులు తిష్టవేసి బరాజ్‌లను ఆనుకుని వేసిన ఇసుకమేటలను మింగేస్తున్నారు. రోజుకు టన్నులకొద్దీ ఇసుకను తోడేస్తూ వందలాది లారీల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మొన్నటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్థకమని, కేసీఆర్ లక్షల కోట్లు గోదావరిలో పారబోశారంటూ మిన్నూమన్ను ఏకమయ్యేలా నిందలు వేసి చిందులు తొక్కిన రేవంత్ సర్కార్‌కు ఎట్టకేలకు ఇటీవల జ్ఞానోదయమైంది.
ప్రాజెక్టు విషయంలో ఇంటాబయట తలంటు పోయటంతో ‘ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టులను గాలికి వదిలేయలేం’ అని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించి బరాజ్‌లకు రిపేర్లు చేసి వినియోగంలోకి తెస్తామని స్పష్టంచేశారు. కానీ మరోవైపు ‘నీతి నీళ్లపాలు.. ఇసుక జేబులపాలు’ అన్నట్టు రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్నదనే ఆరోపణలకు బలం చేకూరేలా బరాజ్ పరిసరాల నుంచి రోజుకు తరలిపోతున్న ఇసుక లారీలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఎన్డీఎస్ఏ మార్గదర్శకాల ప్రకారమే పరీక్షల కోసం ఇసుక తవ్వుతున్నామని చెబుతున్నప్పటికీ.. అందుకు విరుద్ధంగా అన్నారం బరాజ్ దగ్గర ఇసుకను తోడేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అన్నారం బరాజ్‌లో పేరుకుపోయిన ఇసుకను తీయాలని మైనింగ్ కార్పొరేషన్ టెండర్లు పిలువడం ఇసుక అక్రమార్కులకు వరంలా మారింది. ఎన్డీఎస్ఏ సూచనల పేరుతో టెండర్లు పిలువటం, ఇసుక తోడేయటం ఈసారి కాదు నిరుడు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను బరాజ్ నుంచి కొల్లగొట్టారు. సాధారణంగా నది, వాగు గర్భం నుంచి(రివర్బెడ్) ఇసుక తీసి బయట పోసిన తర్వాత లారీల్లో లోడింగ్ చేయటం ఆనవాయితీ. కానీ, కాళేశ్వరం బరాజ్‌ల విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.
పూస్కుపల్లి, బ్రాహ్మణపల్లి-1, బ్రాహ్మణపల్లి-2, అంబట్పల్లి, అన్నారం-1, అన్నారం-2.. ఈ ఆరు క్వారీల నుంచి 600 నుంచి 700 లారీల్లో ఇసుక తరలిపోతున్నది. ఒక్క అన్నారం బరాజ్ నుంచే రోజుకు 300 లారీల్లో తరలిస్తున్నారు. అధికారికంగా బయటికి కనిపించే ఈ లెక్కల కంటే రెట్టింపు స్థాయిలోనే తరలిస్తున్నట్టు తెలుస్తున్నది. ఒక్కో లారీకి క్వారీల్లో అక్రమంగా రూ.5వేలు వసూలు చేసినా రోజుకు ఒక్క అన్నారం బరాజ్ నుంచే రూ.15లక్షలు వసూలు అవుతున్నట్టు సమాచారం. ఈ సొమ్మును క్వారీల కాంట్రాక్టర్లు టీజీఎండీసీ అధికారులకు వాటాలు పంచారనేది బహిరంగ రహస్యమని, అందుకే అధికారులకు ఇక్కడి దందా గురించి తెలిసినా పట్టించుకోరనే ఆరోపణలున్నాయి. అయితే ఏ సంవత్సరం ఎంత ఇసుక తీశారు? ఎంత తీయాలి? అనే లెక్కలు చెప్పేందుకు అధికారులు ముందుకు రాకపోవడంతో అనుమానాలకు తావిస్తున్నది.
బరాజ్ సమీపం, గేట్ల మధ్యలో మేటవేసిన ఇసుకతో పాటు బరాజ్ బేస్ కన్నా దిగువ(పిల్లర్ మొదట నుంచి భూమి లోపలికి)కు ఎట్టి పరిస్థితుల్లో తోడకూడదని, ఒకవేళ అలా చేస్తే అది బరాజ్ ఉనికికే ప్రమాదం అని సాగునీటిరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయమై టీజీఎండీసీ అధికారులతో అన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయంటూ కొట్టిపారేస్తున్నారు. అన్నారం బరాజ్‌కు అప్ స్ట్రీమ్‌లో లక్ష, డౌన్ స్ట్రీమ్‌లో లక్షన్నర టన్నుల ఇసుకను ఇప్పటివరకు తీశామని, టెండర్ అగ్రిమెంట్ ప్రకారం అప్ స్ట్రీమ్‌లో 6.90లక్షల మెట్రిక్ టన్నులు, డౌన్‌స్ట్రీమ్‌లో 4లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తీయాల్సి ఉన్నదని పేరు చెప్పేందుకు నిరాకరించిన ఓ అధికారి చెప్పారు. అయితే అది తాము పరిశీలించినప్పటి విషయమని, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూసి చెప్తామని పేర్కొన్నారు. దీంతో అన్నారం బరాజ్ పరిసరాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అనుమానాలు మరింత బలపడుతుండటం గమనార్హం.
తవ్వకాలు, లోడింగ్ కాంట్రాక్టర్లు అంతా అధికార పార్టీ నేతలే ఉన్నారని తెలుస్తున్నది. నిబంధనలను ఉల్లంఘించి సరార్కు సమకూరాల్సిన ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారని, ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే ‘అంతా మా ఇష్టం. మమ్ములను ఎవరూ అడుగొద్దు’ అనే బెదిరిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. గోదావరి నుంచి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో గోదావరి ఇసుకకు గిరాకీ ఉండగా ఇదే అదునుగా అధికార పార్టీ నేతలు పరిమితికి మంచి ఇసుక రవాణా చేస్తున్నారు.
లారీల యజమానులు ప్రభుత్వానికి చెల్లించిన డీడీ కంటే ఎకువ మొత్తంలో లోడింగ్ చేస్తున్నారు. ప్రతి లారీలోనూ రెండు బకెట్లను అక్రమంగా నింపుతున్నారని, అలా అక్రమంగా నింపిన లారీ లోడ్లకు బయట మార్కెట్ విలువ తక్కువలో తక్కువ లెక్కగట్టినా కనీసం రూ.30 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. క్వారీల్లో ఇసుక లోడింగ్ , కాంటా ప్రక్రియను పర్యవేక్షించాల్సిన మైనింగ్ అధికారులు అక్రమార్కులకు సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.