హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 2(నమస్తే తెలంగాణ): దేవాదాయశాఖలోని అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మొదటిసారి ఏర్పాటుచేసిన ధర్మవాణికి వినతులు వెల్లువెత్తాయి. సోమవారం బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అర్చక ఉద్యోగులు తరలివచ్చి తమ సమస్యలను ఆ శాఖ డైరెక్టర్ హన్మంతరావుకు వివరించారు. ఈ సందర్భంగా హన్మంతరావు మాట్లాడుతూ.. శాఖలోని ఎవరైనా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి డైరెక్టర్ కార్యాలయంలో నేరుగా సమస్యలను తెలుపవచ్చని చెప్పారు.
పలువురి సమస్యలను పరిశీలించిన ఆయన, వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఓ రిటైర్డ్ అర్చకుడికి పెండింగ్ గ్రాట్యుటీ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హన్మంతరావు.. ఆయనను అక్కడే కూర్చుండబెట్టి సమస్యను పరిష్కరించాలని సూచించారు. కొండగట్టులో ఇటీవల అర్చక ఉద్యోగులను సస్పెండ్ చేసిన విషయంపై వారు డైరెక్టర్‌ను కలిసి సమస్యను వివరించగా, ధర్నాలు చేయడం సరికాదంటూ మందలించి వారి నుంచి లేఖ తీసుకుని సస్పెన్షన్ ఎత్తివేయాలని అధికారులను ఆదేశించారు.
ధూప దీప నైవేద్య పథకం అర్చకుల సమస్యలను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ డైరెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ధర్మవాణిలో వచ్చిన సమస్యలను వారంలో పరిష్కరించాలని, ఒకవేళ సమస్యను పరిష్కరించకపోతే అందుకు కారణాలను వివరిస్తూ దరఖాస్తుదారుకు తెలియజేయాలని హన్మంతరావు సూచించారు. కార్యక్రమంలో ఏడీసీలు శ్రీనివాసరావు, కృష్ణవేణి, ఆర్జేసీ రామకృష్ణారావు, డీసీలు వినోద్‌రెడ్డి, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.