Pak-Saudi defence pact | దాయాది పాకిస్థాన్, సౌదీ అరేబియా (Pakistan-Saudi Arabia) మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆ దేశ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వ్యూహాత్మక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రెండు దేశాల్లో దేనిపైన అయినా దాడి జరిగితే అది ఇద్దరిపైనా జరిగిన దాడిగా భావిస్తారు. అప్పుడు రెండు దేశాలూ దాడి చేసిన దేశంపై పోరాడేలా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్- భారత్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ ఒప్పందం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఒప్పందంపై భారత్ (India) తాజాగా స్పందించింది. ఈ ఒప్పందం పరిణామాలను అర్థం చేసుకునేందుకు అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొంది. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి, అన్ని రంగాల్లో సమగ్ర జాతీయ భద్రతను నిర్ధారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
‘పాక్-సౌదీ మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరినట్టు మా దృష్టికి వచ్చింది. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాము. జాతీయ భద్రతకు, అలాగే ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వంపై చూపే ప్రభావాలను అధ్యయనం చేస్తున్నాం. జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి, అన్ని రంగాల్లో సమగ్ర జాతీయ భద్రతను నిర్ధారించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
Also Read..
Donald Trump: యాంటిఫా గ్రూపును ఉగ్రసంస్థగా ప్రకటించిన ట్రంప్
Pennsylvania Shooting | అమెరికాలో కాల్పులు.. ముగ్గురు పోలీసులు మృతి