Pahalgam Attack | మంగళవారం మధ్యాహ్నం ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పెహల్గామ్ (Pahalgam)లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో కశ్మీర్లోయతోపాటు దేశంమొత్తం భగ్గుమంది. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్‌పై కఠిన చర్యలకు దిగింది. సింధూ జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty ) నిలిపివేసింది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకూ పాక్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. కేంద్రం ప్రకటనతో ప్రస్తుతం దేశం మొత్తం ఈ ఒప్పందం గురించే తీవ్రంగా చర్చించుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సింధు, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ (India), పాకిస్థాన్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. 1960లో జరిగిన ఈ ఒప్పందంపై అప్పటి రెండు దేశాల ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, అయూబ్‌ఖాన్ సంతకాలు చేశారు. రెండు దేశాల మధ్య 6 నదులకు సంబంధించిన నీటి పంపకాల వివాదాలకు పరిష్కారంగా ఈ ఒప్పందం జరిగింది. రెండు దేశాల మధ్య ఇప్పటికీ అనేక వివాదాలు ఉన్నప్పటికీ.. ఈ ఒప్పందంపై ఎలాంటి ప్రభావం లేకపోవడం విశేషం.
నీటి సరఫరా కోసం 1948 మార్చి 31 నాటికి పాకిస్థాన్‌కు కొంత వాటా ఇవ్వాలని నిర్ణయించారు. 1948 ఏప్రిల్ 1 న, భారతదేశం కాలువల నీటిని నిలిపివేసింది. దాంతో పాకిస్థాన్‌లో పరిస్థితి మరింత దిగజారింది. రెండు దేశాల మధ్య పలు దఫాలుగా సమావేశాలు జరిగాయి. చివరకు సింధు జలాల ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
ఈ ఒప్పందం ప్రకారం, సింధు నది లోయలోని నదులను తూర్పు, పశ్చిమ నదులుగా విభజించారు. తూర్పు ప్రాంతంలోని రవి, బియాస్, సట్లెజ్ నదులు భారతదేశానికి.. సింధు, చీనాబ్, జీలం నదులను పాకిస్థాన్‌కు ఇచ్చారు. పాకిస్థాన్‌లోని నదుల నీటిని విద్యుత్, నీటిపారుదలకు పరిమితంగా ఉపయోగించుకునే హక్కు కూడా భారతదేశానికి ఉన్నది. రెండు దేశాల మధ్య సహకారం కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటైంది. దీనికి బాధ్యులుగా ఉన్న ఇరు దేశాల కమిషనర్లు ఏటా రెండుసార్లు సమావేశమవుతారు. ఈ నదులపై నిర్మించిన ప్రాజెక్టులను సందర్శించి క్షేత్రస్థాయిలో తనిఖీలు జరుపుతారు. ఈ ఒప్పందంలో ప్రపంచ బ్యాంకు విధాన బాధ్యతలు నిర్వహిస్తుంది. వివాదాలు తలెత్తినప్పుడు ఇరు దేశాలూ కోరితేనే జోక్యం చేసుకుంటుంది.
సింధు నది విస్తీర్ణం దాదాపు 11.2 లక్షల కి.మీ. ఈ ప్రాంతం పాకిస్థాన్ (47 శాతం), భారతదేశం (39 శాతం), చైనా (8 శాతం), ఆఫ్ఘనిస్తాన్ (6 శాతం)లో ఉన్నది. సింధు నది పరిసర ప్రాంతాల్లో దాదాపు 30 కోట్ల మంది నివసిస్తున్నారు. విభజన సమయంలో సింధు నది లోయ, దాని కాలువలను కూడా విభజించారు. అయితే పాకిస్థాన్ దాని నీటి వాటా కోసం పూర్తిగా భారత్‌పై ఆధారపడి ఉన్నది.
ఇటీవలే కాలంలో ఐడబ్ల్యూటీ (సింధు నదీ జలాల ఒప్పందం) విషయంలో భారత్-పాక్ మధ్య విభేదాలు తలెత్తాయి. పాకిస్థాన్ ఏకపక్ష నిర్ణయాల కారణంగా రెండు దేశాల మధ్య చేసుకున్న ఒప్పందంలో తేడాలు వస్తున్నాయి. దీంతో సింధు జలాల ఒప్పందానికి సవరణలు తీసుకొచ్చేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే, దీని నుంచి తప్పించుకునేందుకు పాక్ దారులు వెతుక్కుంటున్నది. దీనిపై పాకిస్థాన్‌కు భారత్ నోటీసులు కూడా జారీ చేసింది.
ఈ ఒప్పందం అమలుపై పరస్పర ఆమోదయోగ్యమైన రీతిలో ముందుకు సాగుదామని భారత్ పదేపదే చేస్తున్న విజ్ఞప్తులను పాక్ బేఖాతరు చేస్తున్నది. 2017 నుంచి 2022 వరకు ఐదుసార్లు శాశ్వత ఇండస్ కమిషన్ సమావేశాలు జరిగినప్పటికీ ఈ అంశంపై చర్చించేందుకు పాక్ నిరాకరించింది. కిషన్ గంగా, రాటిల్ జల విద్యుత్తు ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు పాక్ మొండికేస్తున్నది. మధ్యవర్తిత్వ న్యాయస్థానం ద్వారా తమ అభ్యంతరాలను పరిష్కరించాలని ప్రతిపాదించింది.
దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన భారత్.. ఈ వ్యవహారాన్ని తటస్థ నిపుణులకు అప్పగించాలని ప్రపంచ బ్యాంక్‌ను కోరింది. ఈ పరిణామాలపై 2016లో ప్రపంచ బ్యాంక్ స్పందిస్తూ సమస్యకు శాంతియుత పరిష్కారాన్ని కనుగొనాలని భారత్, పాక్‌కు సూచించింది. అయితే, పాక్ ఒత్తిడి మేరకు ఇటీవల ప్రపంచ బ్యాంకు ఒకేసారి తటస్థ నిపుణుడి అభ్యర్థనతోపాటు మధ్యవర్తిత్వ కోర్టు ప్రక్రియను ప్రారంభించింది. దీనిపై భారత్ స్పందిస్తూ.. ఒకే అంశంపై రెండు సమాంతర చర్యలు చేపట్టడం సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.
ఇక గతంలో రెండు దేశాల మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. తొమ్మిదేండ్ర క్రితం ఉరిలో భారతీయ సైనికులను ఉగ్రవాదులు బాంబులతో హతమార్చిన సమయంలో ఈ ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేయాలనే డిమాండ్లు వచ్చాయి. అయితే, అప్పుడు ఆవైపుగా అడుగులు పడలేదు. ఇప్పుడు పెహల్గామ్ నరమేధంతో పాకిస్థాన్‌పై చర్యలు తప్పలేదు.
Also Read..
Encounter | జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాదుల కాల్పుల్లో సైనికుడు మృతి
Encounter | బీజాపూర్‌లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
Pahalgam Attack | ఉగ్రదాడి.. భారత్‌లో పాకిస్థాన్ ఎక్స్ అకౌంట్ నిలిపివేత