కోల్‌కతా: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) విధులు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారిణి ఆత్మహత్యకు పాల్పడింది. (Bengal Poll Officer Sucide) అయితే పని ఒత్తిడి కారణంగా ఆమె మానసికంగా బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్గురి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్వో) శాంతిమోని ఎక్కా తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడి మరణించింది. ‘సర్’ పని ఒత్తిడి కారణంగా ఆమె మానసికంగా బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిరంతర క్షేత్ర విధులు, ఎన్నికలకు సంబంధించిన బాధ్యతలు, ఒత్తిడి భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె భర్త, పిల్లలు ఆరోపించారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. బీఎల్వో శాంతిమోని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె మరణంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ భారతి పశ్చిమ బెంగాల్లో సర్ పురోగతిని సమీక్షించేందుకు కోల్‌కతాను సందర్శించిన సమయంలో ఈ సంఘటన జరుగడం కలకలం రేపింది.
మరోవైపు బీఎల్వో శాంతిమోని ఆత్మహత్యపై సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ విధించిన ప్రణాళిక లేని, అవిశ్రాంతమైన పనిభారం కారణంగా అధికారులు విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. గతంలో మూడేళ్లు పట్టే ఈ ప్రక్రియను ఇప్పుడు ఎన్నికలకు ముందు రెండు నెలల్లో పూర్తిచేసి కేంద్ర పాలకుల మెప్పు కోసం ఎన్నికల అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారని ఆమె ఆరోపించారు. ఈసీఐ మనస్సాక్షితో వ్యవహరించాలని, ప్రణాళిక లేని సర్ డ్రైవ్‌ను వెంటనే ఆపాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read:
Omar Abdullah | ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో కశ్మీర్ ప్రజలను దోషులుగా చూస్తున్నారు.. ఒమర్ అబ్దుల్లా
Bengaluru cash van loot | ప్రభుత్వ అధికారులుగా పేర్కొని.. క్యాష్ వ్యాన్ నుంచి రూ.7 కోట్లు లూటీ
Bombay High Court | ఆత్మహత్య చేసుకుంటానని జీవిత భాగస్వామి బెదిరించడం క్రూరత్వమే: బాంబే హైకోర్టు