ముంబై: ఆత్మహత్య చేసుకుంటానని జీవిత భాగస్వామి పదే పదే బెదిరించడం క్రూరత్వమేనని హైకోర్టు తెలిపింది. అలాంటి పరిస్థితుల్లో వైవాహిక సంబంధాన్ని కొనసాగించడం అసాధ్యమని పేర్కొంది. ఒక వ్యక్తికి విడాకులు మంజూరు చేసింది. (Bombay High Court) మహారాష్ట్రకు చెందిన దంపతులకు 2006లో వివాహమైంది. అయితే వైవాహిక గొడవల వల్ల 2012 నుంచి వారిద్దరూ విడిగా నివసిస్తున్నారు. భార్య తనను అనుమానించడంతోపాటు ఆత్మహత్యకు పాల్పడతానని పదే పదే బెదిరిస్తున్నదని భర్త ఆరోపించాడు. భార్య నుంచి విడాకులు కోరుతూ కుటుంబ కోర్టును ఆశ్రయించాడు.
కాగా, 2019లో విడాకుల పిటిషన్ను కుటుంబ కోర్టు తిరస్కరించడాన్ని ఆ వ్యక్తి బాంబే హైకోర్టులో సవాల్ చేశాడు. ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్, జస్టిస్ గౌతమ్ అంఖద్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. జీవిత భాగస్వామి ఆత్మహత్య చేసుకుంటానని పదేపదే బెదిరించడం క్రూరత్వానికి సమానమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బెంచ్ ప్రస్తావించింది.
మరోవైపు అలాంటి పరిస్థితుల్లో శాంతియుత వాతావరణంలో వైవాహిక సంబంధంలో జీవిత భాగస్వాములు కొనసాగడం అసాధ్యమని బాంబే హైకోర్టు తెలిపింది. ఆ దంపతులు దశాబ్ద కాలంగా విడివిడిగా నివసిస్తుండటంతో వారి మధ్య సామరస్యపూర్వక పరిష్కారం లేదా సయోధ్య సాధ్యం కాదని ధర్మాసనం భావించింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తికి విడాకులు మంజూరు చేసింది. అయితే సెటిల్మెంట్ కింద భార్యకు రూ. 25 లక్షలు ఇవ్వాలని, రెండు ఫ్లాట్ల యాజమాన్యం హక్కులు ఆమెకు బదిలీ చేయాలని ఆ వ్యక్తిని ధర్మాసనం ఆదేశించింది. గతవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
Also Read:
Child Dies Of Toy In Chips Packet | చిప్స్ ప్యాకెట్లో చిన్న బొమ్మ.. అది మింగి బాలుడు మృతి