ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే (IIT Bombay) హాస్టల్ రూమ్‌లో ఐదు బుల్లెట్లను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీహార్‌కు చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 19న తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో హాస్టల్ నంబర్ 1 గ్రౌండ్ ఫ్లోర్లో మొదటి సంవత్సరం బీటెక్ విద్యార్థులైన సూరజ్ దూబే, అమన్ మధ్య ఆర్థిక లావాదేవీపై గొడవ జరిగింది.
కాగా, హాస్టల్ భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని విద్యార్థులను శాంతింపజేశారు. అయితే విద్యార్థి సూరజ్ దూబే, అతడి స్నేహితుడు అపూర్వ్ మిశ్రా నుంచి మద్యం వాసన రావడాన్ని గమనించారు. క్యాంపస్‌లోని హాస్టల్ ఆవరణలో మద్యాన్ని నిషేధించిన నేపథ్యంలో సూరజ్ దూబే రూమ్‌ను తనిఖీ చేశారు. అతడి గదిలో ఉన్న నల్లటి బ్యాగ్‌లో ఐదు లైవ్ 7.65 ఎంఎం కార్ట్రిడ్జ్లను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు.
మరోవైపు లైవ్ బుల్లెట్ల గురించి సూరజ్‌ను భద్రతా సిబ్బంది ప్రశ్నించగా ఆ బ్యాగ్ స్నేహితుడు అపూర్వ్‌కు చెందినదని తెలిపాడు. అపూర్వ్ను ఆరా తీయగా బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన పరిచయస్తుడైన 23 ఏళ్ల సర్వోత్తమ్ ఆనంద్ సతీశ్‌చంద్ర చౌదరి ఆ బుల్లెట్లు తెచ్చినట్లు చెప్పాడు. ఫిబ్రవరి 12న ఐఐటీ బాంబై క్యాంపస్‌ను అతడు సందర్శించిన సమయంలో తన బ్యాగ్ లోపల లైవ్ కాట్రిడ్జ్‌లను ఉంచినట్లు వెల్లడించాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
అయితే అదే రోజున రాత్రి సమయంలో ఐఐటీ బాంబే క్యాంపస్‌కు సర్వోత్తమ్ వచ్చాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. బుల్లెట్ల గురించి ప్రశ్నించగా బీహార్‌లోని ముంగేర్‌లో వాటిని కొనుగోలు చేసినట్లు అతడు చెప్పాడు. దీంతో అక్రమంగా మందుగుండు సామగ్రి కలిగి ఉండటం, రవాణా చేయడం వంటి నేర సెక్షన్ల కింద సర్వోత్తమ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐఐటీ బాంబే క్యాంపస్‌లోకి లైవ్ కార్ట్రిడ్జ్లను తీసుకురావడం వెనుక ఏదైనా నేరపూరిత కుట్ర ఉన్నదా? అన్నది దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో ఐఐటీ క్యాంపస్‌లో భద్రతను మరింత కట్టుదిట్టడం చేశారు.
Also Read:
couple sentenced to death | పిల్లల లైంగిక వీడియోలు రికార్డ్ చేసి అమ్మకం.. దంపతులకు మరణశిక్ష
Watch: పరీక్షలో కాపీని అడ్డుకున్న ప్రొఫెసర్.. వైద్య విద్యార్థి దాడి, వీడియో వైరల్
Watch: సిగరెట్ కాల్చవద్దన్నందుకు.. బైక్ పెట్రోల్ ట్యాంకులోకి లైటర్ విసిరిన వ్యక్తి