Namo Bharat : దేశంలోనే తొలిసారిగా రూపొందిన నమో భారత్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్)ను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ కారిడార్ మొత్తం పొడవు 82 కిలోమీటర్లు. అంటే 82 కి.మీ. దూరాన్ని 45 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇది దేశ రాజధాని ఢిల్లీని, సమీపంలోని ఇతర ప్రధాన నగరాలను కలుపుతుంది. ఈ రైలు మార్గం ద్వారా ఘజియాబాద్, సహీబాబాద్, మోదీనగర్, మీరట్‌ను అత్యంత వేగంగా చేరుకోవచ్చు.
దీని ద్వారా ఆయా మార్గాల్లో కాలుష్య రహిత, ట్రాఫిక్ రహిత రవాణా సౌకర్యం కలగనుంది. ఢిల్లీ-మీరట్‌లోని ఈ రైలు మార్గం నిర్మాణానికి రూ.30,274 కోట్లు ఖర్చైంది. ఇది దేశంలోని తొలి ఆర్ఆర్టీఎస్ మార్గం. ఈ రైలు మార్గంలో 180 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణిస్తుంది. ఆర్ఆర్టీఎస్తోపాటు మీరట్ మెట్రో రైలును కూడా ప్రధాని ప్రారంభించారు. ఇది దక్షిణ మీరట్ నుంచి మోదీపురం మధ్య నడుస్తుంది. ఇది కూడా అత్యం వేగవంతమైన రైలు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సౌత్ మీరట్ స్టేషన్ నుంచి మోదీపురం స్టేషన్ వరకు 23 కిలోమీటర్ల దూరాన్ని 30 నిమిషాల్లోపే చేరుకుంటుంది. ఈ రైలు సేవలు నేటి సాయంత్రం ఆరు గంటల నుంచి అందుబాటులోకి వస్తాయి.
నమో భారత్, మీరట్ మెట్రో ఒకే స్టేషన్ సంబంధిత సేవల్ని వాడుకుంటాయి. మెట్రోను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి మీరట్ సౌత్ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీ-మీరట్ మెట్రో సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రతి 10 నిమిషాలకో ట్రైన్ నడుస్తుంది. ప్రస్తుతం మాత్రం ప్రతి 15 నిమిషాలకు ఒక ట్రైన్ నడుస్తుంది. ఇక.. నమో భారత్, మెట్రో రైలుతోపాటు రూ.12,390 కోట్ల విలువైన ప్రాజెక్టుల్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.