House Demalish | కోల్ సిటీ: 20 ఏండ్ల నాటి ఇంటిని ఎందుకు కూల్చారని రెండు రోజులుగా అన్నపానీయాలు లేకుండా న్యాయం కోసం బల్దియా మెట్లు ఎక్కితే ఒక్కరూ పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాకు దిక్కెవరని, మాకు న్యాయం జరగదా..? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి నుంచి వచ్చేసరికి ఇంటిని కూల్చివేశారని బాధిత కుటుంబం బుధవారం గోడు వెల్లబోసుకుంది.
ఈ మేరకు రెండో రోజు రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగం ఎదుట సుమారు నాలుగు గంటల పాటు నిరసన తెలిపారు.
నగర పాలక సంస్థ 21వ డివిజన్ పరిధిలోని ఎల్కలపల్లి గేట్లో మీనుగు లిఖిత అనే మహిళ నివాసం ఉంటుంది. తన ఇంటిని నెల రోజుల క్రితం మున్సిపల్ అధికారులు వచ్చి కూల్చివేశారని ఆరోపిస్తూ తన అత్తమామలు, ఆడబిడ్డ, చంటి పిల్లలతో కలిసి మున్సిపల్ ఆఫీసు ఎదుట మంగళవారం రోజంతా బైఠాయించిన సంగతి విషయం తెలిసిందే. రెండో రోజు బుధవారం కూడా కుటుంబ సభ్యులతో కార్యాలయానికి చేరుకొని టౌన్ ప్లానింగ్ విభాగం చాంబర్ ఎదుట న్యాయం కోసం అధికారులను ప్రాధేయపడినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ తాము ఇంట్లో లేని సమయంలో మున్సిపల్ సిబ్బంది వచ్చి ఇంటిని కూల్చివేశారని, ఆ సమయంలో ఇంటిలో విలువైన బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు ఉన్నాయని వాపోయారు. 20 ఏండ్ల నుంచి ఉంటున్న ఇంటిని కూల్చివేయడానికి గల కారణాలు అడిగితే.. పై అధికారుల నుంచి ఆర్డర్ అని అంటున్నారని పేర్కొన్నారు. తమకు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదని వాపోయారు. కూల్చిన ఇంటికి నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని వేడుకున్నారు.