లక్నో: మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను పది రోజుల పాటు స్తంభానికి కట్టేశారు. దేవుడి ప్రతినిధిగా చెప్పుకునే ఒక స్వామి ద్వారా మూఢనమ్మకం పేరుతో చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ మహిళ ఆరోగ్యం క్షీణించడంతో ఆమె మరణించింది. (woman tied to pillar for 10 days, Dies) ఉత్తరప్రదేశ్‌లోని బరాబంకి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లక్నోలోని గోమతీనగర్‌లో నివసించే 33 ఏళ్ల రూబీ యాదవ్ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నది. ఆమె భర్త అంకిత్ యాదవ్ మూఢనమ్మకాల ద్వారా చికిత్స అందించేందుకు ప్రయత్నించాడు. దేవుడి ప్రతినిధిగా చెప్పుకునే 71 ఏళ్ల స్వామి మున్నాను ఆశ్రయించాడు.
కాగా, దేవా ప్రాంతంలోని ఒక ప్రదేశంలో సుమారు పది రోజుల పాటు రూబీని ఒక స్తంభానికి వారు కట్టేశారు. ఆమె మానసిక అనారోగ్యానికి చికిత్స పేరుతో కొన్ని ఆచారాలు, పూజలు నిర్వహించారు. ఆగస్ట్ 3న ఆ మహిళ ఆరోగ్యం క్షీణించడంతో ఆ సాయంత్రం దేవాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఆ రాత్రి ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
మరోవైపు రూబీ తండ్రి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె భర్త అంకిత్, స్వామి మున్నా, అతడి సహాయకుడైన 55 ఏళ్ల ఖాదిర్ అహ్మద్‌ను అరెస్టు చేశారు. పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాత నిందితులపై తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి వెల్లడించారు.