Ayurveda | ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం మంచి ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు, ఆ ఆహారం శరీరంలో సరిగ్గా జీర్ణమై పోషకాలుగా మారడం కూడా అంతే ముఖ్యమని ఆయుర్వేదం చెబుతోంది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ వైద్య విధానం ప్రకారం ప్రతి వ్యక్తి శరీర తత్వం భిన్నంగా ఉంటుంది. అందువల్ల అందరికీ ఒకే రకమైన ఆహారం సరిపోదని, వ్యక్తిగత శరీర స్వభావానికి అనుగుణంగా ఆహారాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచిస్తోంది. ఆయుర్వేదం ప్రకారం మంచి ఆరోగ్యానికి మూలం బలమైన జీర్ణవ్యవస్థ. ఆహారం సక్రమంగా జీర్ణమై శరీరానికి అవసరమైన శక్తిని అందించినప్పుడు జీవక్రియలు సమతుల్యంగా పనిచేస్తాయి. వ్యక్తి శారీరక అవసరాలకు అనుగుణంగా తీసుకునే ఆహారం ఔషధంలా పనిచేసి జీవక్రియలను సమతుల్యం చేయడంతోపాటు శరీరానికి ఉత్సాహాన్ని, చైతన్యాన్ని అందిస్తుందని ఆయుర్వేదం పేర్కొంటోంది.
మనిషి ప్రకృతిలో భాగమేనని భావించే ఆయుర్వేదం శరీరాన్ని మూడు ప్రధాన దోషాల ఆధారంగా వివరిస్తుంది. అవే వాత, పిత్త, కఫ. ఈ మూడు శక్తులు ప్రతి వ్యక్తిలో వేర్వేరు నిష్పత్తుల్లో ఉంటాయని, వాటి ఆధారంగానే ఆహార అవసరాలు కూడా మారుతాయని చెబుఓంది. అందుకే ఒకరికి అనుకూలమైన ఆహారం మరొకరికి తప్పనిసరిగా సరిపోవాల్సిన అవసరం లేదని వివరిస్తోంది. వాత దోషం అధికంగా ఉన్నవారికి ఉడికించిన ధాన్యాలు, వెన్న, పాల పదార్థాలు, గింజలు, ఉడికించిన కూరగాయలు అనుకూలంగా ఉంటాయి. అయితే పచ్చి సలాడ్లు, ఎక్కువ పండ్లు, బీన్స్ వంటి ఆహారాలను పరిమితంగా తీసుకోవడం మంచిది. పిత్త దోషం ఎక్కువగా ఉన్నవారికి పచ్చి సలాడ్లు, ఉడికించిన ధాన్యాలు, పాలు, విత్తనాలు అనుకూలమైన ఆహారాలు కాగా ఎక్కువ కారం, వేడి పదార్థాలు, పులుపు ఎక్కువగా ఉన్న ఆహారాలు, డీప్ ఫ్రై చేసిన వంటకాలు, పెరుగు, వెనిగర్ వంటి పులియబెట్టిన పదార్థాలను తగ్గించాలి.
కఫ దోషం అధికంగా ఉన్నవారు సలాడ్లు, ఉడికించిన కూరగాయలు, మసాలా ఆహారం, క్వినోవా, మిల్లెట్స్, మొక్కజొన్న పిండి, బక్వీట్ వంటి ఆహారాలను తీసుకోవడం మంచిది. పాల పదార్థాలు, మాంసాహారం, చీజ్, గింజలు, గోధుమలు, బియ్యం వంటి ఆహారాలను పరిమితంగా తీసుకోవాలి. ఆయుర్వేదం సూచించే సాధారణ ఆహార నియమాల్లో తాజా ఆహారానికి మొదటి ప్రాధాన్యం ఉంటుంది. సీజన్‌కు అనుగుణంగా స్థానికంగా పండిన తాజా ఆహారాల్లోనే అధిక పోషకాలు లభిస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారాల కంటే సహజమైన సంపూర్ణ ధాన్యాలు, సంపూర్ణ పండ్లు, కాలానుగుణ కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం మంచిది.
సాధ్యమైనంత వరకు సేంద్రీయ పద్ధతిలో పండించిన ఆహారాన్ని ఎంచుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ప్రతి భోజనంలో ఆరు రుచులు ఉండేలా చూసుకోవాలి. తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు అనే ఆరు రుచులు సమతుల్యంగా ఉండటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా భోజనం చేసిన తర్వాత సంతృప్తి కలుగుతుంది. మధ్య మధ్యలో చిరుతిళ్లు తినే అలవాటు, అతిగా తినడం తగ్గే అవకాశం ఉంటుంది. పండ్లు, కూరగాయలకు రోజువారీ ఆహారంలో ప్రత్యేక స్థానం ఇవ్వాలి. నీలం, ఊదా, ఎరుపు, ఆకుపచ్చ, నారింజ రంగుల పండ్లు, కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా శరీరాన్ని సహజంగా శుభ్రపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయని ఆయుర్వేదం తెలియజేస్తోంది.