శ్రీనగర్: ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో కశ్మీర్ ప్రజలంతా దోషులే అన్న వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతోందని జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. (Omar Abdullah) ఉగ్రవాద దాడిలో కొంతమంది వ్యక్తులు పాల్గొన్నందున కశ్మీర్లోని మొత్తం జనాభాను అనుమానంగా చూస్తున్నారని అన్నారు. నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో 13 మంది మరణించారు. 20 మందికిపైగా గాయపడ్డారు. పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ కారులో పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, కుల్గాంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఢిల్లీ పేలుళ్ల గురించి సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడారు. ‘ఢిల్లీలో జరిగిన దానికి కొంతమంది బాధ్యులు. కానీ దానికి మనమందరం కారణమనే భావన సృష్టిస్తున్నారు. కొంతమంది చేసిన దాని పరిధిలోకి కశ్మీర్ ప్రజలను తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతున్నది. మన పరువు తీయడానికి ప్రయత్నించినప్పుడు, ప్రతి వైపు నుంచి మనల్ని అనుమానాస్పద దృష్టితో చూసినప్పుడు, ప్రస్తుత పరిస్థితుల్లో తమ పిల్లలను బయటకు పంపడానికి తల్లిదండ్రులు ఇష్టపడరు’ అని అన్నారు.
మరోవైపు ఇలాంటి పరిస్థితుల్లో కశ్మీర్ ప్రజలు బయటకు వెళ్లడం కూడా కష్టమవుతుందని సీఎం ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. జమ్ముకశ్మీర్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాన్ని ఢిల్లీలో నడపడం కూడా నేరంగా పరిగణిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘నాతో పాటు ఎక్కువ మంది భద్రతా సిబ్బంది లేనప్పుడు, ఢిల్లీలో నా కారును బయటకు తీయాలా వద్దా అని నేను ఆలోచిస్తాను. ఎందుకంటే ఎవరైనా నన్ను ఆపి నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను అక్కడికి ఎందుకు వచ్చాను అని అడుగుతారో లేదో నాకు తెలియదు’ అని అన్నారు.
Also Read:
Bombay High Court | ఆత్మహత్య చేసుకుంటానని జీవిత భాగస్వామి బెదిరించడం క్రూరత్వమే: బాంబే హైకోర్టు
Child Dies Of Toy In Chips Packet | చిప్స్ ప్యాకెట్లో చిన్న బొమ్మ.. అది మింగి బాలుడు మృతి