Cow attack : తాను పెంచి పోషిస్తున్న ఆవు (Cow) తనను పొడిచింది. దాంతో అతడు అదుపు తప్పి పక్కనే ఉన్న బురద మడుగులో పడిపోయాడు. స్థానికులు చూసి అతడిని బయటికి తీసే ప్రయత్నం చేసినా బురదగా ఎక్కువగా ఉండటంతో ఆలస్యం జరిగింది. దాంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం హత్రాస్ జిల్లా (Hatras district) లోని నగ్లా అనీ గ్రామంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నగ్లా అని గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ (55) అనే వ్యక్తికి ఆవులు ఉన్నాయి. వాటిని తన ఇంటి సమీపంలోని ఓ బురద మడుగు దగ్గర వాటిని కట్టేస్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం సంతోష్ కుమార్ ఆవులను విప్పేందుకు వెళ్లాడు. ఒక ఆవును విప్పి మరో ఆవును విప్పుతుండగా.. అంతకుముందే విడిచిపెట్టిన ఆవు అతడిని పొడిచింది.
దాంతో సంతోష్ కుమార్ అదుపుతప్పి బురద మడుగులో పడిపోయాడు. బురద ఎక్కువగా ఉండటంతో అతడికి బయటకు రావడం సాధ్యపడలేదు. స్థానికులు అతడిని బయటికి తీసేందుకు ప్రయత్నించినా బురద కారణంగా రెండు గంటల సమయం పట్టింది. అప్పటికే అతడు మరణించాడు. ఇంతలో అధికారులు, పోలీసులు కూడా ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.