Waqf Bill | వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill) రాజ్యసభ (Rajya Sabha) ముందుకు వచ్చింది. గురువారం మధ్యాహ్నం ఈ బిల్లును ఎగువ సభలో కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ బిల్లును కేంద్ర న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) సభలో ప్రవేశపెట్టి చర్చ ప్రారంభించారు. చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 119 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. అయితే, బీజేపీకి సొంతంగా 98 మంది ఎంపీల బలం ఉంది. మిత్రపక్షాలతో కలిపి 125 మంది సభ్యుల మద్దతు ఉంటుంది.
మరోవైపు, వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభ (Lok Sabha)లో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ బిల్లును కేంద్ర న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రవేశపెట్టగా.. 12 గంటల పాటు అంటే అర్ధరాత్రి 12 వరకూ దీనిపై చర్చ సాగింది. అనంతరం ఓటింగ్ జరిగింది. ఈ బిల్లుకు అనుకూలంగా 282 మంది ఓటు వేశారు. 232 మంది దీన్ని వ్యతిరేకించారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ బిల్లకు ఓటింగ్ ద్వారా ఆమోదం లభించింది.
వక్ఫ్ బిల్లును లోక్సభలో ‘బుల్డోజ్’ చేశారు : సోనియా గాంధీ
వక్ఫ్ బిల్లును లోక్సభలో ‘బుల్డోజ్’ చేశారని కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ విమర్శించారు. వివాదాస్పద పరిస్థితులు, ఉద్రిక్త వాతావరణం మధ్య లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లు- 2024 ఆమోదం పొందిందని అన్నారు. వక్ఫ్ బిల్లు విషయంలో తమ పార్టీ వైఖరి స్పష్టంగా ఉందని సోనియా తెలిపారు. ఈ బిల్లును రాజ్యాంగంపై దారుణమైన దాడిగా ఆమె అభివర్ణించారు. ఈ బిల్లుపై లోక్సభలో 12 గంటల పాటు చర్చించినప్పటికీ ప్రతిపక్షాల సభ్యులకు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. ఈ బిల్లు దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మారుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
నేడు ఈ బిల్లు ఎగువ సభ ముందుకు రాబోతోందని.. ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పార్టీ సభ్యులకు సూచించారు. ప్రతిపక్ష పార్టీల సమన్వయంతో రాజ్యసభలో ఈ బిల్లును తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని కేవలం కాగితానికి పరిమితం చేస్తూ మోదీ ప్రభుత్వం దేశాన్ని అగాధంలోకి నెడుతోందని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశమని సోనియాగాంధీ ఆరోపించారు. భారత దేశాన్ని తమ నిఘా నేత్రంగా మార్చుకోవాలని మోదీ ప్రభుత్వ ఉద్దేశాన్ని బహిర్గతం చేయాలని నేతలకు సూచించారు.
Also Read..
Sonia Gandhi | వక్ఫ్ బిల్లును లోక్సభలో ‘బుల్డోజ్’ చేశారు : సోనియా గాంధీ
వక్ఫ్ బిల్లుపై వాగ్యుద్ధం.. లోక్సభలో వాడీవేడి చర్చ
Waqf Bill: వక్ఫ్ ప్రాపర్టీల నుంచి 12,000 కోట్ల ఆదాయం రావాలి.. కానీ 163 కోట్లేనా?