న్యూఢిల్లీ, ఏప్రిల్ 2 : వక్ఫ్ (సవరణ) బిల్లుపై బుధవారం లోక్‌సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. బిల్లును రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించిన విపక్షాలు ముస్లింలను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించగా, అధికార ఎన్డీఏ వక్ఫ్ బిల్లును గట్టిగా సమర్థించుకుంది. ముస్లింల మత వ్యవహారాలలో జోక్యం చేసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వక్ఫ్ ఆస్తుల విషయంలో పారదర్శకమైన నిర్వహణను తీసుకురావడమే ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ఆయన తెలిపారు. అంతకుముందు కాంగ్రెస్ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ రాజ్యాంగ మౌలిక స్వరూపంపై దాడి యత్నంగా వక్ఫ్ బిల్లును అభివర్ణించారు. మైనారిటీలను అప్రతిష్ట పాల్జేసి సమాజంలో చీలికలు తేవడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన ఆరోపించారు. బిల్లును సభలో ప్రవేశపెట్టిన మైనారిటీల వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందన్న ప్రతిపక్షాల వాదనను తోసిపుచ్చారు. ఈ బిల్లుకు మతంతో సంబంధం లేదని, ఆస్తుల విషయానికే పరిమితమని ఆయన స్పష్టం చేశారు. ఏ మతపరమైన సంస్థ విషయంలోనూ ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని ఆయన వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వం 2013లో వక్ఫ్ చట్టంలో చేసిన మార్పులు ఇతర నిబంధనలపై ప్రభావం చూపాయని, ఈ కారణంగా కొత్త సవరణలు అవసరమయ్యాయని రిజిజు తెలిపారు. వక్ఫ్ బిల్లుకు సంబంధించని అంశాలపై ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆయన ప్రతిపక్షాలను దుయ్యబట్టారు. ఈ బిల్లును తీసుకురాకపోతే, కొందరు పార్లమెంట్‌ను కూడా వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపాదిత సవరణలు పేద ముస్లింలు, మహిళల సంక్షేమానికి ఉపయోగపడతాయని ఇద్దరు మంత్రులు సభకు హామీ ఇచ్చారు.
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలలో ప్రతికూల ఫలితాలను చవిచూసిన బీజేపీ పునరేకీకరణ వ్యూహంలో భాగంగా వక్ఫ్ బిల్లును తీసుకువచ్చిందని ఆరోపించారు. లౌకిక దేశంగా పేరుగాంచిన భారత ప్రతిష్టకు ఇది మచ్చలాంటిదని, ప్రపంచానికి తప్పుడు సందేశాన్ని పంపిస్తుందని అఖిలేశ్ అన్నారు. చివర్లో జోక్యం చేసుకున్న అమిత్ షా ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించారు. వక్ఫ్ కౌన్సిల్, బోర్డులలో ముస్లిమేతరులను నియమించడంపై విపక్షాలు చేస్తున్న విమర్శను తోసిపుచ్చారు. బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలను రెచ్చగొట్టవద్దని ఆయన హెచ్చరించారు. ఈ చట్టాన్ని మైనారిటీలు ఆమోదించరంటూ ఓ ప్రతిపక్ష ఎంపీ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఇది భారత ప్రభుత్వం, భారత పార్లమెంట్‌కు చెందిన చట్టమని, దీన్ని ప్రతి ఒక్కరూ ఆమోదించాల్సిందేనని అమిత్ షా స్పష్టం చేశారు.
వక్ఫ్(సవరణ) బిల్లును కోర్టులో సవాల్ చేస్తామని, తమ హక్కులకు ప్రమాదకరంగా మారిన నల్ల చట్టానికి వ్యతిరేకంగా పోరాడతామని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ) బుధవారం ప్రకటించింది. బుధవారం వక్ఫ్ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరిగిన నేపథ్యంలో ఏఐఎంపీఎల్బీ మీడియా సమావేశంలో తన కార్యాచరణను వెల్లడించింది. ముస్లిం సమాజం ఆస్తులను సీజ్ చేయడానికే ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొస్తున్నదని ఏఐఎంపీఎల్బీ అధికార ప్రతినిధి మొహమ్మద్ అదీబ్ ఆరోపించారు. ‘మా ఆస్తులను లాక్కోవడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఇది ఆమోదయోగ్యమా? మనం ఓడిపోయామని భావించొద్దు’ అని ఆయన అన్నారు. ఈ బిల్లును ఉపసంహరించుకొనేంత వరకు పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. ముస్లిం పౌరుల రాజ్యాంగ హక్కులను హరించేలా ప్రతిపాదిత బిల్లు ఉన్నదని ఏఐఎంపీఎల్బీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అలీ మోషిన్ అన్నారు. రైతుల తరహాలో దేశ వ్యాప్తంగా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు చేపడతామని, దీనికి దేశ ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. వక్ఫ్ బోర్డుల స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీయడం ద్వారా, ముస్లింమేతరులకు వక్ఫ్ బోర్డుల్లో స్థానం కల్పించడం ద్వారా వక్ఫ్ సొంత మతపర నిధులను, దాతృత్వ నిధులను నిర్వహించుకొనే హక్కును దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలోకి వలసలు, విదేశీయుల ప్రవేశం, నివాసం.. తదితర అంశాలను నియంత్రించే ‘ఇమిగ్రేషన్, ఫారినర్స్ బిల్లు’కు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. కొద్ది రోజుల క్రితమే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలుపుగా, తాజాగా రాజ్యసభ ఆమోదముద్ర వేసింది.