మోర్తాడ్, మార్చి 10: ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర లభించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి.. కలెక్టర్ ఇలా త్రిపాఠిని కోరారు. సీజన్ ప్రారంభంలో ఎర్రజొన్నల ధర క్వింటాలుకు రూ.3,850 ఉండగా వ్యాపారుల సిండికేట్ కారణంగా రూ.3,450కి పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. సోమవారం ఆయన కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. కలెక్టర్‌కు ఎర్రజొన్న రైతు లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, వ్యాపారుల సిండికేట్‌ను అరికట్టాలని కోరారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఎర్రజొన్న రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి పరమావధి కావాలని, రైతులను నష్టపరిచే ఎలాం టి చర్యలనైనా సహించేది లేదని స్పష్టం చేశారు.
జిల్లాలో ఎర్రజొన్న వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి కృత్రిమంగా ధరలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారం తమకు అందినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎర్రజొన్న సాగు, ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని తెలిపారు. రైతులు మక్కజొన్న వైపు మొగ్గుచూపడంతో గతేడాది 34వేల ఎకరాల్లో ఎర్రజొన్నను సాగుచేసిన రైతులు ఈసారి 23వేల ఎకరాల్లో మాత్రమే సాగుచేశారని చెప్పారు. పంట ఉత్పత్తి తగ్గితే సహజంగా ధర పెరగాల్సి ఉండ గా, వ్యాపారులు కలిసి కృత్రిమంగా ధరలను తగ్గించే ప్రయత్నం చేయడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదన్నారు. ప్రసుత్తం ఎర్రజొన్నకు క్వింటాలుకు రూ.4వేల వరకు ధర రావాల్సి ఉండగా, వ్యాపారులు సిండికేట్‌గా మారి రూ.3,450 కి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
యుద్ధం పేరుతో వ్యాపారులు తప్పించుకునే యత్నాలు
ఎర్రజొన్న ధర తగ్గడానికి అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు కారణమంటూ వ్యాపారులు తప్పించకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎర్రజొన్న ప్రధానంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్, ఉత్తర భారతదేశ రాష్ర్టాలకు ఎగుమతి అవుతుందని, అక్కడ ఎలాంటి యుద్ధ పరిస్థితులు లేవని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మూడు, నాలుగేండ్లుగా అమలులో ఉన్న నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, విత్తనాలు ఇచ్చే సమయంలో రైతులతో తప్పనిసరిగా బైబ్యాక్ అగ్రిమెంట్ చేసుకోవాలని అన్నారు. విత్తనాలు ఇచ్చిన వ్యాపారులే రైతుల పంటను కొనుగోలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ విషయంపై కలెక్టర్ వెంటనే వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి వ్యాపారులు రైతులతో చేసుకున్న బై బ్యాక్ అగ్రిమెంట్ల వివరాలను సేకరించాలని కోరారు.
గిట్టుబాటు ధర లభించకపోతే పోరాటమే
బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాలతో పాటు నిజామాబాద్ రూరల్ జక్రాన్‌పల్లి మండలాల్లో ఎర్రజొన్న సాగు ఎక్కువగా ఉన్నందున, అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చే యాలని సూచించారు. రైతులకు నష్టం కలిగించే వ్యాపారులను ఉపేక్షించకూడదన్నారు. జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్, అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే మక్కజొన్న ధరలు పడిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పు డు ఎర్రజొన్న ధర కూడా తగ్గితే మరింత నష్టపోతారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే జో క్యం చేసుకుని రైతులకు క్వింటాలుకు కనీసం రూ.4వేలు ధర అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కూడా ఈ అంశంపై సానుకూలంగా స్పందించి త్వరలోనే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు వేముల చెప్పారు. ఎర్రజొన్న రైతులందరూ సంఘటితం కావాలని, గిట్టుబాటు ధర లభించకపోతే పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.