చౌటుప్పల్, ఆగస్టు 14: సీమాంధ్ర పాలకుల, సీమాంధ్ర మీడియా చెప్పుచేతల్లో తె లంగాణలోని కాంగ్రెస్ పార్టీ గానీ, ప్రభుత్వం గానీ నడువొద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కోరారు. ఆత్మగౌరవం కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని, ఇందుకోసం ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం నిలిచేలా పాలన కొనసాగాలని హితవు పలికారు. శుక్రవారం చౌటుప్పల్లోని సీతారామచంద్ర స్వామి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన రాజగోపాల్రెడ్డి.. ఆనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రె స్లోని అంతర్గత పరిణామాలపై, ప్రభుత్వ తీరుపై ఆయన మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ లో, ప్రభుత్వంలో మొదటి నుంచి ప నిచేసిన నాయకు లు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. బయటి నుంచి పార్టీలోకి కొత్తగా వచ్చిన వారి ఆధిపత్యం నడుస్తున్నదని విమర్శించారు. పార్టీ బలహీనపడొద్దనే కొన్ని అంశాలను బహిరంగంగా ప్రస్తావిస్తున్నానని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం పనిచేయాలే తప్ప సీమాంధ్ర కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేయొద్దని డిమాండ్ చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తంచేసిన ఆయన తాను మాత్రం కాంగ్రెస్ సైనికుడిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు.