‘అమ్మ పెట్టదు – అడుక్కు తిననీయదు’ అనే నానుడికి అక్షరాలా నిజం చేస్తోంది రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కట్టుకొని పన్నెండేళ్లుగా పేదలు అక్కడే నివాసం ఉంటున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఆ భూమిలోంచి పేదలను తొలగించాలనుకున్న రేవంత్ ప్రభుత్వం.. పేదల గూళ్లను కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే భూదాన్ బాధితులందరినీ తీసుకొచ్చి ఖమ్మం నడిబొడ్డున ఉన్న టీటీడీసీ, అంబేద్కర్ భవనాల్లో పడేసింది. ఉన్న గూడు కోల్పోయి ఉండడానికి నిలువ నీడ లేక సామాన్లతో ఎటు పోవాలో పాలుపోక నిర్వాసితులంతా ఆ పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటున్నారు. వందలాది బాధితులు ఉంటున్న పునరావాస కేంద్రాల్లో అవసరమైన మౌలిక సౌకర్యాలను కూడా ప్రభుత్వం కల్పించలేదు. కనీసం భోజన ఏర్పాట్లు కూడా లేవు. దీంతో ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి. అయినప్పటికీ ఆ పేదలపై కసితీరని ప్రభుత్వం మరింత కర్కశంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే పొమ్మనలేక పొగబెడుతున్నట్లు వ్యవహరిస్తోంది.
– రఘునాథపాలెం, మార్చి 10
సౌకర్యాలు లేకుండా చేస్తే నిరాశ్రయులంతా కేంద్రాల నుంచి వెళ్లిపోతారనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏర్పాట్ల ముచ్చట అటుంచితే.. పునరావాస కేంద్రాల్లో ఉండే బాధితులకు బాధ్యతగా భోజన ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం ఆ దిశగా తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. గత 15 రోజులుగా రెండు పునరావాస కేంద్రాల్లోని బాధితులంతా భోజనం కోసం ఇతరులపై ఆధారపడాల్సిన దయనీయ స్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆ బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. తొలుత ఒకటీ రెండు రోజులు పార్టీ నేతలు బాధ్యత తీసుకొని భూదాన్ బాధితుల ఆకలి తీర్చారు. ఆ తరువాత ఆ బాధితులను పువ్వాడ ఫౌండేషన్ అక్కున చేర్చుకొంది. భూదాన్ నిర్వాసితులందరికీ న్యాయం జరిగే వరకు నిత్యం రెండు పూటలా భోజన ఏర్పాట్లకు హామీ ఇచ్చింది. ఈ మేరకు నిత్యం అన్నదానం చేస్తున్నది. అంతేకాదు.. ప్రత్యేక ట్యాంకర్లతో 24 గంటలు మంచినీటి వసతిని, ఉచిత వైద్య శిబిరాన్ని సైతం ఏర్పాటు చేసింది.

అన్నదానాన్ని అడ్డుకున్న పోలీసులు
రోజూ మాదిరిగానే మంగళవారం కూడా అన్నదానం నిర్వహించేందుకు పువ్వాడ ఫౌండేషన్ బాధ్యులు, బీఆర్ఎస్ నాయకులు భోజనాల వాహనాలతో వచ్చారు. అయితే, ఆ వాహనాలను అంబేద్కర్ భవన్లోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. వైరా ప్రధాన రహదారి నుంచి లోనికి వెళ్లనీయకుండా వాహనాలను నిలువరించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు వాహనాలను అక్కడే నిలిపి రోడ్డు చెంతనే అన్నదానం చేశారు. దీంతో పునరావాస కేంద్రాల్లోని బాధితులంతా అక్కడికే వచ్చి భోజనాలు చేశారు. అనేకమంది పేదలు భోజనాలను ప్లేట్లలో తీసుకెళ్లి తమ కుటుంబీలకు పెట్టుకున్నారు. బాధితుల ఇబ్బందులను గమనించిన పోలీసులు కొద్దిసేపటి తరువాత పువ్వాడ ఫౌండేషన్ వాహనాలను అంబేద్కర్ భవన్లోకి అనుమతించారు.
పునరావాస కేంద్రాల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం
నిలువ నీడ లేకుండా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తొలి రోజు నుంచే బాధితుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోంది. టీటీడీసీ, అంబేద్కర్ భవనాల నుంచి వారిని వెళ్లగొట్టే కుట్రలను కొనసాగిస్తూనే ఉంది. అనర్హుల పేరుతో పునరావాస కేంద్రాల నుంచి బాధితులను వెళ్లగొట్టేందుకు బలవంతపు చర్యలకు పూనుకుంటోంది. ఈ క్రమంలో బాధితులందరినీ అక్కడి నుంచి తరలించేందుకు ఇటీవల ఒక రోజు పెద్ద ఎత్తున వాహనాలతో భారీ పోలీసు బలగాలు వచ్చి విఫలమయ్యాయి. నిర్వాసితులంతా అడ్డుకొని, లోపలి నుంచి గేట్లకు తాళాలు వేయడంతో వెనుదిరిగిపోయారు. అయినప్పటికీ పోలీసుల చర్యలు చూస్తుంటే మాత్రం ‘బాధితులందరినీ ఎప్పుడు తరలిద్దామా?’ అన్నట్లుగానే ఉన్నాయి. మంగళవారం కూడా అంబేద్కర్ భవనానికి వచ్చిన ఖమ్మం ఏసీపీ.. బాధితులందరూ కేంద్రం నుంచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేయడం, హెచ్చరికలు జారీ చేయడమే ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోంది. భూదాన్ బాధితులంతా వెళ్లిపోవాలని, అర్హులైన వారికి అధికారులు ఫోన్లు చేస్తారని హుకుం జారీ చేశారు. ఆ అధికారి తీరుపై బాధితులంతా కన్నెర్ర జేశారు. కూల్చిన చోటనే తిరిగి ఇళ్లు కట్టించి ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని బాధితులు తేల్చి చెప్పారు.