వేములవాడ, ఆగస్టు 15: వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలోని సంకల్ప మండపంలో భక్తుల సాక్షిగా ఇద్దరు సేవకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇద్దరు గొడవపడి.. తన్నుకున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇటీవల స్వామి వారి ఆలయంలో పరిచారకులుగా చేరిన ఉద్యోగులకు ఆలయ పరిపాలన కార్యాలయం స్థానాచార్యుల సూచనలతో విధులను కేటాయించారు.
శ్రావణమాసం ప్రారంభం కావడంతో ఇద్దరు పరిచారకులకు సంకల్ప మండపంలో విధులను కేటాయించారు. ఆగస్టు 15, శనివారం ఉదయం దాదాపు 10 గంటల సమయంలో ఇద్దరు కూడా విధులకు హాజరయ్యారు. ఇందులో ఒకరికి మరొకరు ఫోన్ చేసి.. ‘అక్కడ ఎవరెవరు విధుల్లో ఉన్నారు?’ అని అడిగి తెలుసుకున్నారు. అయితే.. అక్కడ విధుల్లో ఉన్న వారందరి పేర్లు చెప్పినప్పటికీ తోటి పరిచారకుడి పేరు మాత్రం అతడు చెప్పలేదు. దీంతో మరో పరిచారుకుడు అతడి దగ్గరికి వెళ్లి.. ‘ఎవరు ఫోన్ చేశారు?’ అని అడిగాడు. అందుకు అతడు ‘అది నా పర్సనల్’ అని చెప్పాడు. ‘మరి.. ఎందుకు ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వారందరి పేర్లు చెప్పావు? అడిగిన వారికి నా పేరు ఎందుకు చెప్పలేదు?’ అని రెండో వ్యక్తి ప్రశ్నించాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు చెయ్యి చేసుకున్నారు.
భక్తులు ఉండే సంకల్ప మండపంలోనే ఒక్కసారిగా వారు గొడవకు దిగడంతో భక్తులు సైతం నివ్వర పోయారు. అప్రమత్తమైన అర్చకులు, విధుల్లో ఉన్న ఉద్యోగులు ఆ ఇద్దరిని పరిపాలన కార్యాలయంలోని అధికారి వద్దకు తీసుకెళ్లారు. గొడవను గురించి తెలుసుకున్న అక్కడి అధికారి మీకంటే వయసులో పెద్దవారితో ఎట్లా మాట్లాడుతారు? అంటూ మందలించడమే కాకుండా క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని కూడా వారిని హెచ్చరించారు. అయితే.. బయటకు వచ్చిన తర్వాత సదరు పరిచారకుడు నాకేంటి ఈయన చెప్పేది? అంటూ అధికారిపై ఉద్యోగుల ముందే నానా దుర్భాషలాడినట్లు తెలిసింది. ఇటీవలే వేములవాడ రాజన్న ఆలయంలో పరిచారకులుగా విధుల్లో చేరిన సదరు ఉద్యోగులు క్రమశిక్షణ లేకుండా వ్యవహరించిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది.