పెండ్లంటే నూరేండ్ల పంటే. పంట పండినా అప్పులు తీరని తల్లిదండ్రులకు ఆడకూతురి పెండ్లి గుండెల మీద కుంపటి లెక్కనే ఉంటుండె. అప్పుల మీద అప్పులు చేస్తూ తల తాకట్టు పెట్టిన కుటుంబాలకు అభయమిచ్చిండు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. పేదింటి పెండ్లికి పెద్ద దిక్కుగ నిలవడ్డడు. కళ్యాణ లక్ష్మి కానుకను చదివించి.. తల్లిదండ్రుల భారాన్ని పంచుకున్నడు. పుష్కర కాలం కిందట ఇదే రోజున ఈ బృహత్ పథకం మొదలైంది. లక్షలకుటుంబాలు అప్పుల పాలు కాకుండా కాపాడింది. బీఆర్ఎస్ హయాంలో లక్షణంగా సాగిన కళ్యాణలక్ష్మి సంబురం.. నేడు ఎదురుచూపులతంతుగా మిగిలింది. తులం బంగారానికి ఆశపడి భంగపడ్డ వాళ్లకు కాంగ్రెస్ జమానాలో కళ్యాణలక్ష్మి తీరని కోరికగానే మిగిలింది.
ఆడబిడ్డ నిజంగా లక్ష్మీదేవే. ఆడపిల్లకు పెండ్లయిపోతే.. అప్పగింతలప్పుడు కన్నీళ్లు, ఆనక అప్పులు మిగులుతయి. అందుకే జనం అనుభవాల్లో ‘ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసి చూడు’ అనే మాటపుట్టింది. పెండ్లి చేస్తే తల మీద భారం తగ్గుతుందని తల్లిదండ్రులకు చానామంది సలహాలిస్తుంటరు. ఆ భారం దించుకోవడమంటే అప్పుల భారాన్ని నెత్తికెత్తుకోవడమేనని ఎంతోమంది తల్లిదండ్రుల మాట.ఊళ్లకు పోయి చింతల కింద కూర్చున్న ముసలమ్మల ముచ్చట్లు వింటే భలేగుంటయ్! సాధారణ మాటల్లోనే సామాన్యుడి తత్వం వినిపిస్తుంటది! పిల్లలు పుట్టిన కాలాన్ని తుఫానులు, కరువులు, గుడి కట్టినప్పుడు, బడి పెట్టినప్పుడో… లేకుంటే ఏడాది వెనక్కో, ముందుకో జరిపి చెప్పుకొంటరు.
‘మా పెద్దది పుట్టినప్పుడు గుంట జాగ కొన్నం’, చిన్నది పుట్టిన రెండేండ్లకు ఇల్లు కట్టినమని గుర్తు పెట్టుకుంటరు. సంవత్సరాలు, క్యాలెండర్లు ఎరుగని మనుషులు చెప్పే ముచ్చట్లు వింటుంటే భలే ముచ్చటేస్తది. ఆడవాళ్ల ముచ్చట్లన్నీ చీరలు, నగలు, అలంకారం గురించే ఉంటుందని అనుకునే అమాయకులకు ఆ మాటలు కండ్లు తెరిపిస్తయ్. వ్యవసాయ పనులు తీరిన రోజుల్లో నడివయసు ఆడవాళ్లు తీరిగ్గా మాట్లాడుకునేప్పుడు అర్థశాస్త్రం వల్లె వేస్తుంటరు.
ఇంటిని ఒంటిచేత్తో నడుపుతూ వ్యవసాయం, కుల వృత్తుల్లో చేదోడయ్యే మహిళల కంటే ఎక్కువ అవగాహన ఎవరికుంటుంది? సంసారమనే బండికి రెండు గీరెల్లాంటి భార్యాభర్తలు కష్టపడి కూడబెట్టిందంతా మేనేజ్ చేసేది ఆడోళ్లే. వచ్చే ఆదాయం ఎంత? అయ్యే ఖర్చెంత? లెక్కలేసి పొదుపు చేయాలని చీటీలు కడుతుంటరు. ధాన్యం నాగుకిచ్చి, కొద్దిపాటి డబ్బుని వడ్డీలకిచ్చి తిప్పుతుంటరు. ఇంట్లో ఆడబిడ్డ ఎదుగుతుంటే పొదుపు, డబ్బు పెంపు అవసరమని అమ్మనాన్నలకు బాగా ఎరుక. ఈ జీవితానుభవాలే పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలకు తొవ్వ చూపింది. ఇసొంటి పథకాలు బిడ్డల పెండ్లి కోసం పొదుపు చేసేటోళ్లకు భద్రత ఇచ్చినయి.
ఆడబిడ్డకు పెండ్లంటే సంబంధం కుదిరితే సరిపోదు. వరుడి కుటుంబం తాహతుకు తగ్గ మర్యాదలు చేయాలె. కలవారి ఇంట జరిగే పెండ్లిలో ఉన్నన్ని హంగూ ఆర్భాటాలూ లేకున్నా.. పేదింట పెండ్లికైనా కొత్త దుస్తులు కొనాల్సిందే. ఏడు వారాల నగలు తేకున్నా కట్టే పసుపు తాడుకి వీసమెత్తు బంగారమైనా జోడించాల్సిందే! ఇక మంచి సంబంధాన్ని వదులుకోకూడదని కట్నకానుకలు కాదనలేరు. ఇక అతిథి మర్యాదలు తప్పేటివి కావు. పెండ్లి మంటపంలో మంత్రోచ్చారణ, ఊరేగింపులో మేళతాళాలు ఉండాల్సిందే. ఇన్ని జరగాలంటే జరుగుబాటు ఉన్న ఇల్లు కూడా అప్పు కోసం మరో ఇంటికాడ చేయి చాపాల్సిందే. బిడ్డ పుట్టిన రోజుల్లో కొన్న గుంట జాగే కాదు వారసత్వంగా వచ్చిన భూమి కూడా అమ్ముకోవాల్సి వస్తది. పెండ్లంటే ఆడపిల్ల తండ్రి ఒక భారాన్ని దించుకుని, ఇంకో భారాన్ని నెత్తికెత్తుకునుడే.
కాలం మారింది. ఇప్పుడు రెక్కల కష్టం మిగిలేటట్టు లేదు. కూడు, గూడే కాదు మంచి జీవితానికి చదువు, ఆరోగ్య జీవితానికి వైద్యం కావాలి. విద్య, వైద్యం ఖరీదైపోయినంక అమ్మలు రేపటి కోసం పోపుల డబ్బాలో పైసలు దాసుకునే పరిస్థితి పోయింది. అప్పుల్లో ఉండే నాన్న కూతురి పెండ్లి కోసం ఎక్కడ మరో అప్పు పుడుతుందా? అని సోచాయిస్తూ ఉంటడు. పంట చేతికొస్తే అప్పు తీరుతదనే నమ్మకం. కానీ, ఈ నూరేండ్ల పంట కోసం పదేండ్లు కష్టపడ్డా పెండ్లి అప్పు తీరదు. ఎన్నో విషాద వార్తల వెనుక ఉన్న నిజం ఇదే. పెండ్లి.. కొత్త జంటకు మాత్రమే కాదు, ఆడకూతురు తల్లిదండ్రులకు కూడా సంబురం కావాలని కేసీఆర్ ‘కళ్యాణ లక్ష్మి’ పథకం తీసుకొచ్చిండు.
తెలంగాణకు కాలికి బలపం కట్టుకుని తిరిగిన రోజుల్లో రాజకీయాలే కాదు భుజం మీద చేయివేసి విన్నప్పుడు చెవిలో పడ్డ ముచ్చట్లెన్నో యాదిల పెట్టుకున్నడు. కన్నీళ్లు పెట్టుకున్న జనాన్ని భుజం తట్టి ధైర్యం చెప్పినట్టే అధికారమనే అవకాశం రాంగనే కళ్యాణ లక్ష్మి కానుక ఇచ్చిండు. అమ్మలకు అన్నలాంటి పాలకుడు ముఖ్యమంత్రి అయిండు. మేనమామ పెండ్లిలో కాలికి వెండి మెట్టెలు తొడిగినట్టే పేదింటి వధువుకి లక్ష పదహార్ల కానుక ఇచ్చిండు. ఆడపిల్ల పెండ్లి ఖర్చును పంచుకుంటూ అందించిన ప్రభుత్వ దీవెన ‘కళ్యాణ లక్ష్మి’. షాదీ జరిగే ఇంటికి సర్కార్ చెప్పిన ముబారక్ ఇది. లేని ఇంట ప్రభుత్వ సాయం అప్పు తీర్చింది. నవ వధువు మెడలో నగయ్యింది.
కేసీఆర్ ఒకపాలి తండాలో నిద్ర చేశిండు. అక్కడ లంబాడా ఇల్లు కాలిపోయింది. బిడ్డ పెండ్లి కోసం దాచుకున్న డబ్బులు కాలిపోయినయి. ‘బిడ్డ పెండ్లెట్ట చేశేది?’ అని ఆ తల్లి ఏడుస్త కూసున్నది. ఆమె దుఃఖం కేసీఆర్ విన్నడు. ఆమెను ఓదార్చిండు. అప్పటికప్పుడు సాయం చేసి ఆ పేదింటి బిడ్డ పెండ్లి జరిపించిండు. ఆయన మనసులోంచి ఆ దృశ్యం చెరిగిపోలే. అందుకనే, తెలంగాణ సాకారం కాగానే, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే.. ‘కళ్యాణలక్ష్మి’కి శ్రీకారం చుట్టిండు.
నా చిన్న బిడ్డ సంధ్యకు మంచి సంబంధమొచ్చింది. పిలగాడు మంచిగున్నడు, మంచి సంబంధం.. పోగొట్టుకోవద్దని మావోళ్లంతా అన్నరు. నా చిన్న బిడ్డ పెండ్లి నాటికి కరోనా వచ్చింది. ఏది కొందామన్నా ఎక్కువ రేటు చెబుతున్నరు. అయినా కొనక తప్పలే. ఆడంబరానికి పోకుండ పెండ్లి చేద్దామని లెక్కలేసినా అప్పు చేయక తప్పలే. పెండ్లి అయినాంక కొన్ని రోజులకు కళ్యాణ లక్ష్మికి దరఖాస్తు పెట్టినం. మూడు నెలల్లోనే లక్షాపదహారు రూపాయలు మా ఖాతాల పడ్డయి. పెండ్లికి చేసిన అప్పులు ఆ పైసలతోని కొంత తీరినయ్. మా బాధలు నేరుగ వినకున్నా, మాలాంటి వాళ్ల కష్టాలు ఎట్లుంటయో తెలిసి ఈ పథకం పెట్టిండేమో! సారు పంపిన సారె అనుకున్నం. మాలాంటి ఆడపిల్ల తల్లిదండ్రులకు కళ్యాణలక్ష్మి కానుకే కాదు వరం!
-నాగవర్ధన్ రాయల