Sonia Gandhi | వక్ఫ్ బిల్లును లోక్‌సభలో ‘బుల్డోజ్’ చేశారని కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ విమర్శించారు. వివాదాస్పద పరిస్థితులు, ఉద్రిక్త వాతావరణం మధ్య లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు- 2024 ఆమోదం పొందిందని అన్నారు. వక్ఫ్ బిల్లు విషయంలో తమ పార్టీ వైఖరి స్పష్టంగా ఉందని సోనియా తెలిపారు. ఈ బిల్లును రాజ్యాంగంపై దారుణమైన దాడిగా ఆమె అభివర్ణించారు.
దేశ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి కారణమైన వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. నేడు ఈ బిల్లు రాజ్యసభ (Rajya Sabha) ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఎగువ సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. గురువారం ఉదయం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సోనియా గాంధీ మాట్లాడారు. లోక్‌సభ ప్రొసీడింగ్స్‌ను బుల్డోజ్ చేశారని ఆరోపించారు. 12 గంటల పాటు చర్చించినప్పటికీ ప్రతిపక్షాల సభ్యులకు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు.
ఈ బిల్లు దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మారుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. నేడు ఈ బిల్లు ఎగువ సభ ముందుకు రాబోతోందని.. ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పార్టీ సభ్యులకు సూచించారు. ప్రతిపక్ష పార్టీల సమన్వయంతో రాజ్యసభలో ఈ బిల్లును తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని కేవలం కాగితానికి పరిమితం చేస్తూ మోదీ ప్రభుత్వం దేశాన్ని అగాధంలోకి నెడుతోందని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశమని సోనియాగాంధీ ఆరోపించారు. భారత దేశాన్ని తమ నిఘా నేత్రంగా మార్చుకోవాలని మోదీ ప్రభుత్వ ఉద్దేశాన్ని బహిర్గతం చేయాలని నేతలకు సూచించారు.
కాగా, వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ బిల్లును కేంద్ర న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. 12 గంటల పాటు అంటే అర్ధరాత్రి 12 వరకూ దీనిపై చర్చ సాగింది. అనంతరం ఓటింగ్ జరిగింది. ఈ బిల్లుకు అనుకూలంగా 282 మంది ఓటు వేశారు. 232 మంది దీన్ని వ్యతిరేకించారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ బిల్లకు ఓటింగ్ ద్వారా ఆమోదం లభించింది. నేడు రాజ్యసభ ముందుకు ఈ బిల్లు రాబోతోంది.
Also Read..
PM Modi | థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ
IMD Weather Report | ఉత్తరాన పెరగనున్న ఉష్ణోగ్రతలు.. దక్షిణ భారతంలో భారీ వానలు.. ఐఎండీ హెచ్చరికలు..
Tariffs | ట్రంప్ 26 శాతం సుంకాలు.. భారత్ స్పందన ఇదే