న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లు 2025(Waqf Bill)ని లోక్సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు దీనిపై ప్రసంగించారు. వక్ఫ్ అంశాన్ని మతపరమైన కోణంలో కాకుండా, ప్రాపర్టీ కోణంలో చూస్తున్నట్లు వెల్లడించారు. రైల్వేలు, రక్షణ రంగం తర్వాత దేశంలో అత్యధిక భూములు ఉన్నది వక్ప్ బోర్డు వద్దే అని మంత్రి చెప్పారు. అతిపెద్ద సంఖ్యలో భూములు ఉన్నా.. గడిచిన 70 ఏళ్ల నుంచి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లింలకు ఆ భూముల నుంచి లబ్ధి అందకుండా చేశారని ఆయన ఆరోపించారు.
వక్ఫ్ ప్రాపర్టీలను సాధారణ, పేద, అణగారిన ముస్లింల సంక్షేమం, లబ్ధి కోసం ఎందుకు వాడలేదని ఆయన ప్రశ్నించారు. సాధారణ ముస్లింల సంక్షేమం కోసం వక్ఫ్ ప్రాపర్టీలను వాడాల్సిన సందర్భం వచ్చిందన్నారు. 2004 లెక్కల ప్రకారం. దేశంలో 4.9 లక్షల వక్ఫ్ ప్రాపర్టీలు ఉన్నాయన్నారు. వాటి నుంచి వస్తున్న ఆదాయం 163 కోట్లుగా పేర్కొన్నారు. అయితే 2013లో వచ్చిన సవరణ తర్వాత ఆ ప్రాపర్టీల ఆదాయం 3 కోట్లు పెరిగిందన్నారు. అంటే వక్ప్ ఆదాయం 166 కోట్లకు చేరిందన్నారు.
అంత భారీగా ఉన్న ప్రాపర్టీల నుంచి తక్కువ స్థాయిలో ఆదాయం వస్తోందని, ఆ ప్రాపర్టీల నుంచి కనీసం 12 వేల కోట్ల ఆదాయం రావాలని మంత్రి రిజిజు పేర్కొన్నారు. వక్ప్ ప్రాపర్టీలను పేద ముస్లింల కోసం వినియోగించాలన్నారు. వక్ప్ బిల్లును ఆ లక్ష్యం కోసం సిద్ధం చేసినట్లు మంత్రి చెప్పారు. ఎవరి ప్రాపర్టీని లాక్కోవడం లేదన్నారు. 2019లో పౌరసత్వ సవరణ బిల్లును తెచ్చినప్పుడు విపక్షాలు గగ్గోలు పెట్టాయని, కానీ ఒక్క ముస్లిం కూడా తమ హక్కుల్ని కోల్పోలేదన్నారు. ముస్లింలను తప్పుదోవ పట్టించిన విపక్షాలు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.
వక్ఫ్ బిల్లును ఇక నుంచి యునిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ బిల్లుగా పిలవనున్నట్లు మంత్రి రిజిజు తెలిపారు. దేశంలో ప్రస్తుతం 8.72 లక్షల వక్ప్ ప్రాపర్టీలు ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఆ ప్రాపర్టీలను సక్రమంగా వినియోగిస్తే ముస్లింలే కాదు, దేశ పరిస్థితే మారేందన్నారు. మరో ఏడాదిలో కొత్త వక్ఫ్ బిల్లుతో భారీ మార్పు రానున్నట్లు చెప్పారు. అందుకే పేద ముస్లింలు వక్ఫ్ బిల్లును మనస్పూర్తిగా స్వాగతిస్తున్నారని మంత్రి వెల్లడించారు.