MK Stalin | జాతీయ విద్యావిధానం (National Education Policy) అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య ఒకరకంగా యుద్ధమే జరుగుతోంది. కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని స్టాలిన్ (MK Stalin) ప్రభుత్వం ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ విషయంపై సీఎం స్టాలిన్ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. తమిళనాడులోని అన్ని కేంద్ర కార్యాలయాల నుంచి హిందీని తొలగించాలన్నారు (Uninstall Hindi from Union government offices). హిందీకి బదులుగా తమిళాన్ని అధికార భాషగా చేయాలని డిమాండ్ చేశారు.
‘మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తమిళం పట్ల గొప్ప ప్రేమ ఉందని బీజేపీ వాదిస్తోంది. అదే నిజమైతే.. చేతల్లో ఎందుకు చూపించడం లేదు..? పార్లమెంట్లో సెంగోల్‌ను ప్రతిష్టించే బదులు తమిళనాడులోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి హిందీని తొలగించండి. తమిళాన్ని హిందీతో సమానంగా అధికారిక భాషగా చేయండి. సంస్కృతం కంటే తమిళానికి ఎక్కువ నిధులు కేటాయించండి’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. కేంద్ర బడ్జెట్లో తిరుక్కురల్‌ను ఉటంకిస్తే సరిపోదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక పథకాలు, విపత్తు సహాయ నిధి, కొత్త రైల్వే ప్రాజెక్టులను అందించాలన్నారు.
‘కేంద్ర బడ్జెట్లో తిరుక్కురల్‌ను ఉటంకిస్తే సరిపోదు. ఆచరణాత్మక చర్యలను అమలు చేయాలి. ప్రత్యేక పథకాలు, తక్షణ విపత్తు సహాయ నిధి, తమిళనాడుకు కొత్త రైల్వే ప్రాజెక్టులను అందించాలి. అంతేకాదు, రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాజెక్టులు, పథకాల్లో సంస్కృతం వాడకాన్ని ఆపాలి. రైళ్లకు అంత్యోదయ, తేజస్, వందేభారత్ వంటి పేర్లు పెట్టడం ఆపండి. దానికి బదులు చెమ్మోళి, ముత్తునగర్, వైగై, మలైకొట్టై, తిరుక్కురల్ ఎక్స్‌ప్రెస్ మొదలైన వాటిలాగా తమిళ పేర్లను పెట్టండి. తమిళ భాషపై ప్రేమను మాటల్లో కాకుండా.. చేతల్లో చూపించండి’ అని స్టాలిన్ పేర్కొన్నారు.
Also Read..