చెన్నై : దక్షిణాది రాష్ర్టాలపై హిందీ, సంస్కృత భాషలను రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ విస్తృతంగా చర్చ సాగుతున్న నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ త్రిభాషా విధానంపై తన వ్యతిరేకతను ఉధృతం చేశారు. ఉత్తరాది రాష్ర్టాలలో ఈ విధానాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ఆయన కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. హిందీని వ్యతిరేకిస్తున్న తనపై వస్తున్న విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ ఉత్తరాదిలో మూడో భాషగా ఏ భాషను బోధిస్తున్నారో చెప్పాలంటూ విమర్శకులను ప్రశ్నించారు. ప్రజలను తప్పుదారి పట్టించే విధానాలను పరిరక్షించే కొందరు మేధావులు మూడో భాషను నేర్చుకునే అవకాశాన్ని తమిళనాడు విద్యార్థులకు ఎందుకు ఇవ్వడం లేదంటూ ఎంతో ఆవేదనతో తనను ప్రశ్నిస్తున్నారని స్టాలిన్ పేర్కొన్నారు. వారిని తాను సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నానని, ఉత్తర భారతంలో మూడో భాషగా ఏ భాషను బోధిస్తున్నారో చెప్పాలని డీఎంకే అధినేత నిలదీశారు.