చెన్నై: తమిళనాడు సీఎం స్టాలిన్(CM Stalin) ఇవాళ డీలిమిటేషన్ అంశంపై అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలపై డీలిమిటేషన్ అనే ఖడ్గం వేలాడుతోందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియను తమిళనాడు వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రక్రియ వల్ల తమిళనాడుకు ప్రమాదం ఉందన్నారు. దీని వల్ల మనం 12 సీట్లు కోల్పోయే అవకాశాలు ఉన్నాయన్నారు. ఒకవేళ జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే, అప్పుడు తమిళనాడు తన ప్రాతినిధ్యాన్ని కోల్పోతుందన్నారు. కలిసి కట్టుగా ఈ కుట్రను అడ్డుకోవాలన్నారు.
ఒకవేళ పార్లమెంటరీ సీట్ల సంఖ్య పెరిగితే, అప్పుడు మనకు కొత్తగా 22 సీట్లు రావాలని సీఎం స్టాలిన్ తెలిపారు. కానీ ప్రస్తుత జనాభా ప్రకారం, మనకు కేవలం 10 సీట్లు మాత్రమే వస్తాయని, అంటే మనం 12 సీట్లను కోల్పోతామని ఆయన పేర్కొన్నారు. భారతీయ ప్రజాస్వామ్యంలో తమిళనాడు రాజకీయ ప్రాతినిధ్యంపై ఇది నేరుగా జరిగే అటాక్ అని ఆయన ఆరోపించారు. తమిళనాడు స్వరాన్ని బంధించారని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడనివ్వడం లేదన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియకు తామేమీ వ్యతిరేకం కాదు అని, కానీ సామాజిక, రాజకీయ సంక్షేమ పథకాలు అమలు అంశంలో ప్రతికూలతలు ఉండకూడదన్నారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టరాదు అని అఖిల పక్షం డిమాండ్ చేస్తున్నట్లు సీఎం స్టాలిన్ తెలిపారు.
1971 జనాభా లెక్కల ఆధారంగా 2026 తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలని, అది రాబోయే 30 ఏళ్ల వరకు ఉండాలని, ఇవాళ ప్రధాని మోదీని సీఎం స్టాలిన్ కోరారు. పార్లమెంటరీ సీట్ల సంఖ్య పెరిగాలని, అవసరమైన రాజ్యాంగపరమైన సవరణలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడుకు చెందిన డీలిమిటేషన్ డిమాండ్లను ప్రధాని మోదీకి పంపుతున్నట్లు చెప్పారు. ఈ అంశంపై ప్రజల్లోకి వెళ్తామని, వారిలో చైతన్యం కలిగిస్తామన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో ఓ సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తామని, డీలిమిటేషన్ ప్రక్రియపై పోరాడుతామని సీఎం స్టాలిన్ తెలిపారు.